Monday, 8 October 2012

రామాయణంలో శ్రీసాయి (3వ.భాగము)




                                                  
08.10.2012  సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సెప్టెంబరు 30 వ. తేదీనుంచి ప్రచురణకు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆటంకం కలిగింది. ఈ రోజు సాయి.బా.ని.స. రామాయణంలో శ్రీ సాయి 3వ.భాగాన్ని అందిస్తున్నాను.


రామాయణంలో శ్రీసాయి (3వ.భాగము)



మనము రామాయణంలోని బాలకాండను ఒక్కసారి సమీక్షిద్దాము.  ఇందులో దశరధ మహారాజుకు   పుత్ర సంతానాన్ని అనుగ్రహించిన సందర్భము ఉంది. 



దశరధ మహారాజు తనకు పుత్రసంతానం లేదని ఎప్పుడూ విచారిస్తూ ఉండేవారు.  ఇటువంటి సంఘటనే   మనకు శ్రీ సాయి సత్  చరిత్ర  14వ. అధ్యాయములో కనపడుతుంది. రత్నాజీ షాపూర్ జీ  వాడియా నాందేడ్ నివాసి. ఆయనకెంతో సిరిసంపదలు, మంచి ఆరోగ్యం ఉన్నాకూడా పుత్ర సంతానం కలగలేదు . 

రామాయణంలో ఋష్యశృంగ మహర్షి దశరధుని చేత పుత్రకామేష్టి యాగం చేయించినారు.  


ఆ యాగ ఫలితం వల్ల దశరధ మహారాజుకు నలుగురు కుమారులు జన్మించారు.  శ్రీసాయి సత్ చరిత్రలో బాబా రత్నాజీ షాపూర్ జీవాడియాకు పుత్రసంతానాన్ని ప్రసాదించారు.

బాల కాండలో గురువు ఆజ్ఞను గురించి  అత్యంత ప్రాధాన్యాన్నివ్వవలసిన దాని గురించి ప్రముఖంగా చెప్పబడింది.  


యాగ సంరక్షనార్ధం రామ లక్ష్మణులు అడవిలో విశ్వామిత్ర మహామునిని అనుసరించి, వెడుతున్న సమయంలో



విశ్వామిత్ర మునికి తమకెదురుగా ఒక స్త్రీ  రావడం కనపడింది. విశ్వామిత్రులవారు రామునితో ఆమెను ఒక్క బాణంతో చంపమని ఆజ్ఞాపించారు. తమకు అపకారం చేయని ఒక స్త్రీని చంపడం పాపమని రాముడు మొదట సందేహించాడు. ఒక్క క్షణమాగి, తరువాత గురువు ఆజ్ఞను పాలించడమే ముఖ్య కర్తవ్యమని తలంచి, బాణాన్నెక్కుపెట్టి ఒక్క బాణంతొ ఆస్త్రీని వధించినాడు. 
          

తరువాత ఆ స్త్రీ తాటకి అనే రాక్షసి అని తెలుసుకున్నాడు.  శ్రీరాముడు మరేమీ ప్రశ్నించకుండా తన గురువు యొక్క ఆజ్ఞను పాలించాడు.

సరిగా ఇటువంటి సంఘటనే మనకు శ్రీసాయి సత్ చరిత్ర 23వ. అధ్యాయంలో కనపడుతుంది. ద్వారకామాయిలోకి ఒక మేకను తీసుకుని వచ్చారు. బాబా కాకాసాహెబ్ దీక్షిత్ ని పిలిచి, అతనికి ఒక కసాయి కత్తినిచ్చి ఆమేకను ఒకే వేటుతో చంపమన్నారు.  తనకు అపకారం చేయని ఆమేకను ఎట్లా చంపడమా అని మొదట సందేహించాడు కాకా సాహెబ్. కొంతసేపు ఆగిన తరువాత గురువు యొక్క ఆజ్ఞే వేద వాక్యమని తలచి మేకను చంపడానికి కత్తిని పైకి ఎత్తినాడు. ఈలోగా సాయినాధులవారు అతనిని వారించారు. అప్పుడు కాకాసాహెబ్ "మేకను చంపడం తప్పా ఒప్పా అన్నది నాకనవసరం. గురువు చెప్పిన వాక్యాలే వేదాలకన్నా శక్తివంతమైనవని నాకు తెలుసు. నాకు గురువు ఆజ్ఞను పాలించడమొక్కటే తెలుసు." అన్నారు.  ఆవిధంగా నేను రామాయణంలోను, శ్రీ సాయి సత్చిరిత్రలోను ఉన్న పోలికలను గమనించాను.     



(బాలకాండలోని విశేషాలు తరువాయి భాగంలో)
 సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment