Wednesday, 10 October 2012

రామాయణంలో శ్రీసాయి 5వ. భాగము





10.10.2012  బుధవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. చెప్పిన రామాయణంలో శ్రీసాయి

రామాయణంలో శ్రీసాయి 5వ. భాగము

ఇప్పుడు అయోధ్యకాండను సమీక్షిద్దాము.శ్రీ సుందర చైతన్య స్వామీజీ, పగ తీర్చుకోవడం ఎవరికీ మంచిది కాదనే విషయాన్ని 





ఆయన రచించిన చైతన్య రామాయణంలో వివరించారు. 


రామాయణంలోని కైకేయి ప్రవర్తన గురించి అందరికీ తెలుసు. కైకేయే లేకపోతే రాముడు అడవికి వెళ్ళి ఉండేవాడే కాదు. 

నా ఉద్దేశ్యం ప్రకారం కైకేయికన్న ఆమె వద్ద పనిచేసిన  పరిచారిక మంధర ఈ సంఘటనలన్ని జరగడానికి కారకురాలు. మంధర మాట  విని ఉండకపోతే కైకేయి మనసులో చెడుబుధ్ధి కలిగి ఉండేదే కాదు.   


మంధర గత జన్మలో ఒక ఆడ జింక. ఆ జింకకు కూతురు అల్లుడు ఉన్నారు. ఒకరోజున ఆజంట జింకలు రెండు అడవిలో సంతోషంగా విహరిస్తూ ఉన్నాయి. 

ఆసమయంలో కైకేయ మహరాజు వేటకు వచ్చి  తన బాణంతొ అల్లుడు జింకను చంపి  తనతో కూడా తీసుకుని వెళ్ళసాగాడు.


 అపుడు కూతురు  జింక తన తల్లి వద్దకు వెళ్ళి కైకేయి మహారాజు తీసుకుని వెడుతున్న తన భర్త శరీరాన్ని తీసుకుని వచ్చి తల్లి వద్ద ఉన్న సంజీవని మూలికతో బ్రతికించమని అడిగింది.    

అపుడా తల్లి జింక కైకేయి మహారాజు వద్దకు వెళ్ళి ఇలా వేడుకొన్నది "మహారాజా మీరు నా అల్లుడిని చంపారు. అది క్షత్రియ ధర్మం నేను కాదనను. కాని నా అల్లుడి శరీరాన్ని నాకు ఇస్తే నేను వానికి ప్రాణం పోసి నాకూతురికి సంతోషం కలిగిస్తాను.  

కాని కైకేయి మహరాజు ఆ ఆడ జింక మాటను తిరస్కరించి మగ జింక శరీరాన్ని తనతో కూడా తీసుకుని వెళ్ళసాగాడు. అప్పుడా తల్లి  జింక ఇలా శాపమిచ్చింది."రాజా ! నా అల్లుడి చావుకు నువ్వు కారకుడవు. భవిష్యత్తులో నీ అల్లుడి మరణానికి కూడా నేను కారకురాలినవుతాను" అనిశపించి  వెళ్ళిపోయింది.  
  
తరువాత కైకేయి మహారాజు తన కుమార్తె కైకేయిని దశరధ మహారాజుకిచ్చి వివాహం జరిపించాడు. ఆకాలంలో వివాహమైన తరువాత పెండ్లి కుమర్తెతోపాటుగా పరిచారికలను కూడా పంపడం సాంప్రదాయం. కైకేయితోపాటు మంధర పరిచారికగా అయోధ్యకు వెళ్ళింది. ఆ తరువాత జరిగిన సంఘటనలన్ని మనకందరకూ తెలుసు. కైకేయికి మంధర కలిగించిన చెడుబుధ్ధి ప్రేరణ వల్ల దశరధమహారాజు శ్రీరామచంద్రుడిని కారడవులకు పంపవలసి వచ్చింది.  

దశరధ మహారాజు శ్రీరాముని  ఎడబాటును సహించలేక మరణించారు.  


ఆవిధంగా మంధర కైకేయ మహారాజు అల్లుడయిన దశరధ మహారాజు మరణానికి కారకురాలయినది.  గత జన్మలో తను ఇచ్చిన శాపాన్ని అమలుపరిచింది. ఒక జింక తనకు జరిగిన అన్యాయానికి, మరుసటి జన్మలో మనుష్య జన్మ ఎత్తి క్రిందటి  జన్మలో తన అల్లుడిని చంపిన దానికి ప్రతీకారం తీర్చుకోవడం మనకు కనపడుతుంది.   

ఇటువంటి సంఘటనే మనకు శ్రీ సత్ చరిత్ర  46వ. అధ్యాయములో కనపడుతుంది. ఇద్దరు  సోదరులు ఆస్తి పంపకాల  విషయంలో గొడవ పడి ఒకరినొకరు చంపుకొని, మరుసటి జన్మలో మేకలుగా జన్మించారు. 

బాబా మేకలమందలో ఉన్న వాటిని గుర్తించి వాటిని దగ్గరకు తీసుకొని వాటికి శనగలు పెట్టారు. మీకా రెండు మేకలంటే ఎందుకంత  ఇష్టమని శ్యామా బాబాని అడిగాడు. బాబా ఈవిధంగా చెప్పారు "క్రిందటి జన్మలో వారిద్దరూ సోదరులు.ఆస్తి వివాదంలో ఇద్దరూ ఒకరినొకరు చంపుకొన్నారు. వారిద్దరూ నాస్నేహితులు. నాకది గుర్తుకు  వచ్చి వాటికి శనగలు పెట్టాను. నేను మరలా వాటిని వాటి మందలో  పంపివేస్తాను."  ఇక్కడ మనకు మానవుడు పగవైషమ్యాలతో  ఒకరినొకరు చంపుకొంటే  జంతువులుగా జన్మించడం కనపడుతుంది.    

చెన్న బసప్ప, వీరభద్రప్పా  ఇద్దరూ ఆస్తి వివాదాలలో ఒకరికొకరు గొడవలు పడి మరు జన్మలో వారు పాము కప్పగా జన్మించిన వైనమును మనము శ్రీ సాయి సత్ చరిత్ర 47వ. అధ్యాయములో చదివినాము.   

రామాయణంలో మనకు జంతువులు మానవులపై పగ తీర్చుకోవడానికి మానవ జన్మ ఎత్తడం, మానవ జన్మలో పగ వైషమ్యాలతో జీవించి మరుసటి జన్మలో జంతు జన్మ ఎత్తడం, శ్రీ సాయి సత్చరిత్రలో చదివినాము. 

ఆ విధంగా చెడు పనులు చేస్తే జంతు జన్మ వస్తుందని మనకర్ధమవుతుంది. బాబా కూడా ఇదే విషయాన్ని  ఉదాహరణగా చెప్పారు."జంతువులు మంచి పనులు చేస్తే వాటికి మానవ జన్మ లభిస్తుందని  లక్ష్మి కాపర్దే విషయములో తెలియవస్తుంది.   
                                       
(రామాయణంలోకి మనము ఇంకాస్త ముందుకు వెడదాము............)

(సర్వం శ్రీసాయినాధర్పణమస్తు)

No comments:

Post a Comment