19.10.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీశ్శులు
సాయిబంధువులందరకూ దసరా శుభాకాంక్షలు
రామాయణంలో శ్రీసాయి 8వ. భాగము
నవ విధ భక్తిలో 'కీర్తన ప్రాముఖ్యమైనదని రామాయణంలో కూడా చెప్పబడింది.
భరతుడుతమ తండ్రి అయిన దశరధమహారాజులవారి అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన తరువాత శ్రీరామ చంద్రులవారిని ఒప్పించి అయోధ్యకు
తిరిగి రప్పించాలనుకున్నాడు.
ఆ ప్రయత్నంలో అడవిలోకి వెళ్ళుతున్న సమయములో గంగానది
ఒడ్డున ఉన్న గుహుడిని కలుసుకొన్నాడు.
గుహుడు
శ్రీరాములవారిని కీర్తిస్తూ గానం చేస్తున్నాడు. అందుచేత భగవంతుని
కీర్తించడానికి ప్రత్యేకమైన లక్షణాలు ఏమీ ఎవరికీ అవసరం లేదు. ముఖ్యమైనది
భక్తి
మాత్రమే. శ్రీసాయి సత్చరిత్రలో నాకు ఇటువంటి సంఘటనే కనిపించింది. వివిధ
రంగాలలో ప్రావీణ్యత గల జనులందరూ బాబా దర్బారుకు వచ్చేవారు. కొంతమంది
పాటలుపాడేవారు., మరికొందరు నృత్యాలు
చేసేవారు, కొంతమంది పద్యాలు చదువుతూ
తమ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేవారూ
ఉండేవారు. ఒక చెప్పులు కుట్టేవాడు బాబాని తన తల్లి తండ్రి అని సంబోధిస్తూ
ఉండేవాడు. ప్రతీవారికీ కూడా తమదైన పధ్ధతిలో భగవంతుని కీర్తించే అధికారం ఉందని మనం
గ్రహించగలము.
అరణ్యకాండలో భగవంతుడు తన
భక్తులకు జ్ఞాన మార్గాన్ని చూపిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
శ్రీరామచంద్రులవారు
సీతాదేవి అన్వేషణలో ఉన్నారు. శ్రీరాములవారికి ఒక పక్షి నిరంతరం ' శ్రీరామ శ్రీరామా అని
నామ జపం చేస్తూ ఉండటం
వినపడి, ఆశబ్దం వస్తున్న దిశగా అడుగులు వేశారు. అక్కడ
మృత్యువుతో పోరాడుతున్న జటాయువు అనే పక్షిని చూశారు.
జటాయువు రావణాసురుడు
సీతాదేవిని ఎత్తుకువెళ్ళిన విషయాన్ని వివరించి, రావణుని ఎదిరించి
పోరాడినా సీతాదేవిని రక్షించలేకపోయానని విచారిస్తూ చెప్పాడు.
పైగా రావణాసురుడు తనను గాయపరచడం వల్ల లేవలేక
పడి ఉన్నానని చెప్పాడు.
రావణుడిని
వధించి
సీతాదేవిని కాపాడమని జటాయువు శ్రీరాములవారిని కోరాడు. ఇలా చెపుతూ జటాయువు
ఆఖరి
శ్వాస తీసుకొన్నాడు. ఆక్షణం చాలా హృదయవిదారకమైన క్షణం. శ్రీరాములవారి
నేత్రాలు
చమర్చాయి. జటాయువు చేసిన సేవకు గుర్తుగా శ్రీరాములవారు అడవినుంచి
ఎండుకట్టెలను తీసుకునివచ్చి జటాయువుయొక్క అంత్యక్రియలు నిర్వహించారు.
శ్రీరాములవారు
తనతండ్రికి అంత్యక్రియలు నిర్వహించలేకపోయినా, తన తండ్రికి ప్రాణస్నేహితుడైన జటాయువుకు నిర్వహించారు.
ఇటువంటి సంఘటనే మనకు శ్రీ
సాయి సత్చరిత్ర 31వ. అధ్యాయములో
కనపడుతుంది. మేఘుడు బాబాకు అంకిత భక్తుడు. 35 సంవత్సరాల చిన్నవయసులోనే మరణించాడు. బాబా మేఘుని వద్ద కూర్చొని చిన్న పిల్లవానిలా
రోదించారు. అంత్యక్రియలకు శ్మశాన వాటిక వరకు నడిచి వెళ్ళారు. తన స్వంత ఖర్చుతో ఆఖరి రోజున బ్రాహ్మణులకు,
బీదవారికి అన్నదానం చేశారు. ఈ సంఘటన నాకు
జటాయువు మరణ సమయమలో రామాయణంలోని శ్రీరాముని పాత్రను గుర్తుకు తెచ్చింది.
మనమిప్పుడు రామాయణంలోని
పంపా నది ఒడ్డుకు వెళ్ళి శబరి కధ గురించి గుర్తుకు తెచ్చుకొందాము. శబరి
శ్రీరాములవారికి పండ్లను సమర్పించేముందు, తాను ముందుగా కొంచెం కొరికి వాటి రుచి చూసి మరీ అర్పించింది.
ఈ సంఘటన మనకు
భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని భగవంతుడు భక్తికి కట్టుబడి ఉంటాడనే విషయాన్ని ఋజువు చేస్తుంది.
శ్రీ సాయిసత్ చరిత్రలో
కూడా మనకి ఇటువంటి దృష్టాంతమే కనపడుతుంది. శ్రీరామనవమి నాడు భక్తులంతా బాబా
దర్శనానికి వరుసలో నిలబడి ఉన్నారు. మధ్యహ్న్నము ఒక ముసలి స్త్రీ బాబా కు
సమర్పిoచడానికి మూడు చపాతీలను తీసుకొని ద్వారకామాయికి వచ్చింది. ఆమెనెవరూ పట్టించుకోలేదు. తను బాబాని కలుసుకోగలనా లేదా అని సందేహం
వచ్చింది ఆమెకు. బాబాకు సమర్పించడానికి
తెచ్చిన మూడు చపాతీలలో ఒక చపాతీ ఆకలి వేసి ఆమె ఆరగించింది.
మిగిలిన చపాతీలను
తినడానికి ముందే, ఆమె గురించి చెప్పి తన వద్దకు తీసుకుని రమ్మనమని శ్యామాను
పంపించారు బాబా. శ్యామా ఆమెవద్దకు వెళ్ళి స్వయంగా బాబా వద్దకు తీసుకొని
వెళ్ళాడు. బాబా ఆమెను తనకు చపాతీలను
పెట్టమని అడిగారు. తాను అప్పటికె సగం తినేసానని చెప్పింది. మిగిలినవాటిని ఇమ్మని
చెప్పి వాటిని ఆనందంగా ఆరగించారు బాబా. ఈ సంఘటన నాకు రామాయణంలోని శబరి తాను రుచి
చూసిన పండ్లను శ్రీరాములవారికి అర్పించిన సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చింది.
మనమిప్పుడు రామాయణంలోని
అయోధ్యకాండను సమీక్షిద్దాము. సమాజ
శ్రేయస్సుకోరి శ్రీరామ చంద్రులవారు ఒక చిన్న అసత్యమును పలికినారు.
శ్రీరామ చంద్రులవారు
సీతాదేవితో అడవులకు బయలుదేరినప్పుడు దశరధ మహారాజు తన మంత్రి సుమంతుడుని పిలిచి
"రాముడు సామాన్య మానవునిగా అడవులకు వెడుతున్నాడు. అతనిని వెంటనే వెనుకకు
తిరిగి రమ్మని, ఇది రాజాజ్ఞగా
చెప్పు" అన్నారు. పుతృడిమీద ఉన్న ప్రేమ దశరధుణ్ణి గుడ్డివానిని చేసింది. రాజుగా తాను ఇచ్చిన ఆజ్ఞను రాముడు
పాలిస్తాడనుకున్నారు. సుమంతుడు రాములవారికి దశరధ మహారాజువారి ఉత్తర్వులను
తెలియచేశాడు. శ్రీరామ చంద్రులవారు సంధిగ్ధంలో పడ్డారు. అయన ఆజ్ఞ ప్రకారం వెనుకకు
మరలితే ప్రజలందరూ, దశరధ మహారాజు పుత్ర
వాత్సల్యం చేత కైకేయికిచ్చిన మాట తప్పినాడని విమర్శిస్తారు.
శ్రీరామ చంద్రులవారు
సుమంతుడితో "నువ్వు చెప్పినమాటలు నాకు వినపడినవి. కాని, రధం చాలా వేగంగా వెడుతున్నందువల్ల నువ్వు చెప్పిన మాటలు
నాకు వినపడలేదని, విషయం పూర్తిగా
వినేలోగానే రధం అయోధ్య పొలిమేరలు దాటి వెళ్ళిపోయిందని మహారాజుకు చెప్పు. సమాజ
క్షేమం కోసం ఈ ఒక్క అబధ్ధం చెప్పు."
అంటు శ్రీరామ చంద్రులవారు ముందుకు సాగిపోయారు. రావణుడిని అంతమొందించడానికి
భగవంతుడే శ్రీరామునిగా అవనిపై అవతరించారు. ఒక్కడుగు వెనుకకు వేస్తే తన అవతార
కార్యానికి భంగం కలుగుతుంది. తగిన కారణం ఉండటం వల్లే శ్రీరామ చంద్రులవారు తమ
జీవితంలో ఒకే ఒక్కసారి అసత్యము
పలికారు.
తగిన కారణంతో శ్రీసాయి
అసత్యం పలకడం మనకు శ్రీ సాయి సత్
చరిత్రలోని 7వ.అధ్యాయంలో కనపడుతుంది.
రామదాసి అనే భక్తుడు రోజుకు నాలుగు సార్లు విష్ణుసహస్ర నామాన్ని చదువుతూ ఉండేవాడు.
అప్పటికే అతనికి విష్ణుసహస్ర నామం కంఠతా వచ్చేసింది. బాబా తనకు కడుపునొప్పిగా
ఉన్నదని అసత్యమాడి, రామదాసిని సోనాముఖి
ఆకులను తెమ్మని బజారుకు పంపి, రామదాసి
చదువుతున్న విష్ణుసహస్రనామం పుస్తకాన్ని శ్యామాకు బహుకరించారు.
బాబా శ్యామాతో "ఈ
పుస్తకం చాలా పవిత్రమైనది. ఒకసారి నాకు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు ఈ
విష్ణుసహస్ర నామాన్ని నా గుండెలమీద పెట్టుకోగానే ఎంతో ప్రశాంతతని పొందాను. కనీసం
రోజుకు ఒక్క నామాన్నయినా చదువు. అది నీకు ఎంతో మేలు చేస్తుంది. భక్తులందరికీ కూడా
నీ ద్వారా నేను ఈ సందేశాన్నే ఇస్తున్నాను." అన్నారు బాబా. "రామదాసి నాతో
తగవు పెట్టుకుంటాడేమో" అన్నాడు శ్యామా. "ఆవిషయం గురించి
బెంగపెట్టుకోవద్దు, ఏమిజరిగినా నేను
చూసుకుంటానులే" అన్నారు బాబా.
శ్యామా
విష్ణుసహస్రనామాన్ని బాగా అధ్యయనం చేసి,
పూనాలోని డెక్కన్ ఇంజనీరింగ్ కాలేజీలో
ప్రొఫెసరుగా పనిచేస్తున్న ప్రొ.జీ.జీ. నార్కే గారికి దానియొక్క ప్రాముఖ్యాన్ని
వివరించాడు. ప్రతిరోజు విష్ణుసహస్ర
నామాన్ని పఠించడంవల్ల కలిగే ఫలితాన్ని ఆవిధంగా బాబా మనకందరికీ తెలియచేశారు.
జీవితం ఒడిదుడుకులలో
ఉన్నప్పుడు విష్ణుసహస్ర నామ పారాయణే శరణ్యమని చెపుతూ ముగిస్తున్నాను. విష్ణుసహస్ర నామ పారాయణ నాకు ఎంతో
సత్ఫలితాలనిచ్చింది.
శ్రీమతి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గానం చేసిన విష్ణుసహస్ర నామాన్ని కూడా విని ఆనందించండి
(తరువాయి భాగంలో చరణకమలాల గురించి....)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment