Thursday 15 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (08)



సాయి.బా.ని.. డైరీ -  1995  (08)

02.04.1995

నిన్నటిరోజు ఉగాది, నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి నూతన సంవత్సరానికి సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను.  శ్రీసాయి చూపిన దృశ్యాలు నాలో చాలా ఆలోచనలను రేకెత్తించినవి.  వాటి వివరాలు.


"నేను నాభార్య పిల్లలతో రైలు ప్రయాణము సాగించుతున్నాను.  రైలు ఒక చిన్న స్టేషన్ లో ఆగినది.   

అక్కడ చాలా మంది దిగినారు.  నేను నా భార్య పిల్లలు దిగినాము.  అక్కడి ప్రజలను స్టేషన్ పేరు ఏమిటి అడిగినాను.  "మేరే అమ్మ" కా స్టేషన్ అన్నారు కొందరు వ్యక్తులు.  ఆస్టేషన్ మాస్టర్ చాలా ముసలివాడు.  తెల్లని వస్త్రాలు ధరించి యున్నాడు.  నెత్తిమీద తెల్లని వస్త్రము  కట్టుకొన్నాడు. తెల్లని గెడ్డము యున్నది.  ఆవ్యక్తి చేతిలో ఆకువచ్చని జెండా మాత్రమే యుంది.  ఆస్టేషన్ మాస్టర్ గది పాడుపడి బీటలు తీసు యున్నది.  స్టేషన్ మాస్టర్ చిరునవ్వుతో నన్ను నాభార్య పిల్లలను ఆహ్వానించినారు.  నేను ఆయన దగ్గరకు వెళ్ళి మీపేరు ఏమిటి అని అడిగినాను.  "బేనాం" అన్నారు ఆయన.  ఆయన ఆస్టేషన్ లో దిగినవారికి ఆకులలో   పెరుగు అన్నము పెడుతున్నారు.  నేను నాభార్య పిల్లలు పెరుగు అన్నము తిన్నాము.
 
 దాహము   తీర్చుకోవటానికి స్టేషన్ ప్రక్కన యున్న బావిదగ్గరకు వెళ్ళినాము.  నేను నా భార్య  ఆబావి దగ్గర స్నానము చేసి కడుపునిండ నీరు త్రాగినాము.  మాపిల్లలు యిద్దరు రెండు సీసాలలో నీరు నింపుకొన్నారు.  మాలాగనే చాలా మంది ఆస్టేషన్ మాస్టర్ చేతివంట తిని బావిలోని నీరు త్రాగి సంతోషముగా తిరిగి వెళ్ళిపోతున్నారు.   

నాకు నిద్రనుండి మెలుకువ వచ్చినది.  ఒక్కసారి ఆలోచించినాను.  

మేరే అమ్మ అనేది హిందీ పదము.  దానికి అర్ధము నామాతృమూర్తి.  ఒక్కసారిగా ద్వారకామాయి గుర్తుకు వచ్చినది. 

 ఆస్టేషన్ మాస్టర్ రూపము శ్రీసాయినాధుని రూపముగా గోచరించినది.   ఆయన చేతిలో ఆకుపచ్చ జెండాయున్నది.  అంటే ఆస్టేషన్ లో దిగినవారు అందరికి ప్రశాంతత  కలుగుతుంది అనే భావన నాకు కలిగినది.  ఆస్టేషన్ మాస్టర్ పేరు "బేనాం" అంటే పేరులేనివాడిని అని అర్ధము.  మరి శ్రీసాయి శిరిడీకి రాకముందు ఆయనకు పేరులేదు. మహల్సాపతి వారిని మొదటి సారిగా "సాయి" అని సంబోధించినారు.  ఆస్టేషన్ మాస్టర్ అన్నము వండి పెరుగుతో కలిపి ప్రయాణీకులకు పంచుతున్నారు. అంటే తన భక్తుల కోరికలు తీర్చుతున్నారు అని భావించినాను.  స్టేషన్ దగ్గరలోని బావినుండి కొందరు నీరు త్రోడి స్నాము చేసి, దాహము తీర్చుకొంటున్నారు.  అనటే శ్రీసాయి లీలామృతము త్రాగి, అమృతములో మునిగి తేలుతున్న అనుభూతిని పొందుతున్నారు అని భావము.  కొందరు సీసాలలో ఆమృతముతీసుకొని పోతున్నారు అంటే శ్రీసాయితో తమ అనుభవాలను జ్ఞాపకాలుగా మార్చుకొని జీవించుతున్నారని భావించినాను.  శ్రీసాయి నాధుడు తన భక్తులకు, తనకు, మరియు ద్వారకామాయికి మధ్య ఉన్న అనుబంధాన్ని చక్కని దృశ్యరూపములో చూపించినారు కదా - ఈదృశ్యము లోని వివరాలను శ్రీసాయి సందేశాన్ని సాయి బంధువులకు నూతన సంవత్సరము సందర్భముగా తెలియపరచవలెనని నిశ్చయించుకొన్నాను.      

05.04.1995

నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఒక సన్యాసిరూపములో దర్శనము యిచ్చి చెప్పిన మాటలు.  "జీవితములో కష్ఠ సుఖాలు మూడు కాలాల మిశ్రమము.  మనిషి వేసవికాలాన్ని, వర్షాకాలాన్ని, శీతాకాలాన్ని తట్టుకోలేడు. మూడుకాలాల వాతావరణాన్ని తట్టుకోగల నివాసన స్థలాన్ని వెతుకుతు ఒక పాడుబడిన పెంకుటిల్లుకు చేరుకొని అక్కడి యింటియజమాని రక్షణలో ప్రశాంతత పొంది అతనికి కృతజ్ఞత చెప్పుకొంటున్నాడు.  నీకు జీవితములో ప్రశాంతత కావాలి అంటే శిరిడి గ్రామములోని ఆపాడుబడిన పెంకుటిల్లులో నివాసము చేసి ఆయింటి యజమాని రక్షణ పొందు."

 (యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 



No comments:

Post a Comment