Monday, 22 May 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికేఉంది -5

       Image result for images of shirdi saibaba 3d
    Image result for images of rose hd



22.05.2017 సోమవారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈనాటి సమాజములో

మానవత్వము ఇంకా బ్రతికేఉంది

(శ్రీసాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)

సేకరణ : ఆత్రేయపురపు త్యాగరాజు


5.  బక్రీదు పండుగరోజున ఒక మేక ఆకలి తీర్చుట

అది 1991వ.సంవత్సరం బక్రీదు పండుగరోజు.  ఆఫీసుకు సెలవురోజు.  మధ్యాహ్నము 12 గంటలకు ఇంటిలో భోజనము చేసి 12 . 30 నిమిషాలకు ఇంటి గేటు దగ్గరకు వచ్చి ఎదురింటివారితో మాట్లాడుతూ ఉన్నాను. 



 ఆ సమయంలో నాలుగు అడుగుల ఎత్తు గల ఒక తెల్లటి పోతు మేక నా ఇంటి గుమ్మము ముందు నిలబడింది.  ఆ పోతుమేకకు గెడ్డము కూడా ఉంది.  ఆ మేక నాకళ్ళలోకి చూస్తోంది. దానిని చూస్తే తాను ఆకలితో ఉన్నానని తినడానికి ఏదయిన పెట్టమని కోరుతున్న భావనకలిగింది.
             Image result for images of goat

  నా మనసులో శ్రీసాయి సత్ చరిత్ర 42వ.అధ్యాయములో “బాబా సర్వజీవవ్యాపి” అనే విషయము గుర్తుకు వచ్చింది.  వెంటనే నేను నాభార్యను పిలిచి బాబా ఈ రోజున మన ఇంటి గుమ్మం వద్ద మే కరూపంలో వచ్చి నిలబడి ఉన్నారు.  వారు ఆకలితో ఉన్నారు అనే భావన నాకు కలిగింది.  బాబాకు తినడానికి ఏదయిన పెట్టగలవా అని అడిగాను.  అప్పటికి నాభార్య బాబాకు భక్తురాలు కాదు.  ఆమె కొంచము హేళనగా మీబాబా నిన్నరాత్రి మిగిలిపోయిన రొట్టెలు తింటారా అని అడిగింది.  నేను, నీవు ప్రేమతో పెడితే బాబా తప్పక తింటారు అని అన్నాను.  నా భార్య ఒక కంచములో నాలుగు రొట్టెలను తెచ్చి ఆ మేక ముందు పెట్టింది.  ఆ మేక ఆ నాలుగు రొట్టెలను తింది.  నేను ఒక చిన్న బకెట్ తో మంచినీరు తెచ్చి ఆ మేక ముందు ఉంచాను.  ఆ మేక తృప్తిగా మంచినీరు త్రాగి నన్ను నాభార్యను ఆశీర్వదించి వెళ్ళిపోయింది.  ఈ సంఘటనను గుర్తు చేసుకోవడానికి నాయింటిగేటు ప్రక్కన ఒక మంచినీరు తొట్టెను కట్టించాను.  ఆ తొట్టెలో రోజూ నాలుగు బకెట్లు మంచినీరు పోస్తూ ఉండేవాడిని  ఆ నీటిని ఆవులు, గేదెలు, మేకలు, కుక్కలు త్రాగుతూ ఉండేవి.  నోరులేని జీవులకు సేవ చేసుకోవడం ఒక అదృష్టముగా భావించాను.  కాలక్రమేణా 2000 సంవత్సరం నాటికి రోడ్డు వెడల్పు చేసే సందర్భములో మునిసిపాలిటీవారు ఆనీళ్ల తొట్టెను పగలకొట్టివేసారు.  నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను.  కాని జీవితములో కొన్ని సంవత్సరాలు మూగ జీవులకు సేవచేసుకున్నాననే తృప్తి మిగిలింది.

ఇటువంటి సంఘటనకు ఉదాహరణగా బాబా శ్రీ సాయి సత్ చరిత్ర 42వ.అధ్యాయంలో లక్ష్మీబాయి షిండేతో అన్న మాటలు గుర్తు చేసుకొందాము.  “అనవసరంగా విచారించెదవేల?  ఆ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుటవంటిది.  కుక్కకు కూడా ఆత్మ గలదు.  ప్రాణులు వేరుకావచ్చును.  కాని అందరి ఆకలి యొక్కటియే.  కొందరు మాట్లాడగలరు.  కొందరు మూగవలె మాట్లాడలేరు.  ఎవరయితే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే.  దీనినే గొప్ప నీతిగా ఎరుగుము”.  
               Image result for images of shirdi saibaba giving food to dog

బాబా చెప్పిన మాటలను సాయి భక్తులు అందరు పాటించమని కోరుతున్నాను.  మానవత్వము అనేది ఒక్క మానవులకే పరిమితము చేయరాదు.  మూగజీవులపై కూడా మనము మానవత్వము చూపించి, ఆ మానవతా దేవతయొక్క ఆశీర్వచనాలు పొంది సాయిమార్గములో ప్రయాణము సాగించుదాము.

జై సాయిరామ్

(రేపటి సంచికలో రాత్రి 10 గంటలకు ఆకలితో ఉన్నవానికి
  అన్నము పెట్టుట)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment