సాయి.బా.ని.స. డైరీ - 1994
(20)
14.07.1994
నిన్నటిరోజున భగవంతుడు యిచ్చిన ఈ శరీరము గురించి చాలా సేపు ఆలోచించినాను.
రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ - ఈ శరీరమునకు యివ్వవలసిన రక్షణ గురించి చెప్పు తండ్రీ" అని వేడుకొన్నాను.
శ్రీ సాయి రూపము లేని కాంతి కిరణాలుగా దర్శనము యిచ్చి మానవ కంఠముతో అన్న మాటలు
(1) నాకు రూపము లేకపోయిన నా భక్తుల బరువు బాధ్యతలు అనే రధము లాగటానికి ఈగరూపములోను, తూనీగ రూపములోను కష్ఠపడుతునానే.
మరి నీకు శరీరము ఉందే, నీ బరువు బాధ్యతలను పూర్తి చేసుకొనేంతవరకు నీ శరీరమును నీవు జాగ్రత్తగా కాపాడుకోవలసినదే అనేది గుర్తు ఉంచుకో. (2) మానవ జన్మ ఎత్తినతర్వాత శారీరిక బాధలేకాకుండ మానసిక బాధలు అనుభవించాలి. ఆ మానసిక బాధలు శారీరక బాధలుగా మారకుండ భగవంతుని అనుగ్రహము సంపాదించాలి.
18.07.1994
నిన్నటిరోజున నా యింటి వాస్తులోని లోపాలు సరిదిద్దుకోవటానికి అనుమతిని ప్రసాదించమని శ్రీ సాయిని వేడుకొన్నాను.
శ్రీ సాయి రాత్రి కలలో చూపిన దృశ్యము నన్ను చాలా ఆకట్టుకొన్నది.
వాటి వివరాలు. శ్రీ సాయి నన్ను 1967 సంవత్సరమునకు (వెనక్కి) తీసుకొని వెళ్ళినారు. నేను రాజస్థాన్ కోట పట్టణములో పనిచేస్తున్న రోజులు.
నేను ఆ పట్టణములోని పాకిస్థాన్ (పవిత్ర స్థానము) మిఠాయి భండార్ కు వెళ్ళినాను. ఆ దుకాణములో మిఠాయి కొనటానికి హిందువులు, ముస్లింలు కార్లులో వస్తున్నారు.
ఆ దుకాణము యజమాని ఒక ముస్లిం. అతని దుకాణములో హిందూ దేవతల ఫొటోలు యున్నవి.
ఆ దుకాణదారుడు హిందూ దేవతలకు పూజలు చేస్తున్నాడు.
నేను ఆదుకాణము దగ్గరకు వెళ్ళగానే ఆముస్లిం దుకాణదారుడు నన్ను ప్రేమతో పిలచి నా చేతికి మిఠాయి యిచ్చి తినమన్నారు.
నాకు తెలివి వచ్చినది.
శ్రీ సాయి ఈ విధముగా నా యింట వాస్తు దోషాలు సరిదిద్దుకోవటానికి అనుమతిని ప్రసాదించినారు.
19.07.1994
నిన్నటిరోజున నా యింట నా ఆప్త బంధువు నన్ను అవమానపరచినాడు. ఆ బాధను
తట్టుకోలేక చాలా చికాకుపడినాను.
రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికిన్ నమస్కరించి నా మనసుకు ప్రశాంతత కలిగించమని వేడుకొన్నాను.
శ్రీ సాయి చూపిన దృశ్యము నాకు చిరునవ్వు కలిగించి, మనసులోని బాధను తొలగించినది. వాటి వివరాలు "ఓ యింటి యిల్లాలు తన యింటికి తన అత్తగారు, మామగారు వస్తున్నారు అని తెలిసి వారికి గుమ్మములోనే చీపురుతో పూజ చేయటానికి నిలబడి యున్నది.
గుమ్మములో ఒక ఆటోవచ్చి నిలబడినది. ఆమె చీపురుతో ఆటోలోనుండి దిగుతున్న వ్యక్తులను కొట్టడానికి సిధ్ధపడినది. ఆ సమయములో ఆటోనుండి దిగిన వ్యక్తులు తన తల్లి, తండ్రి అని తెలిసి చాలా సిగ్గుపడిపోయి చూపురు కట్ట బయటకు విసిరి వేసినది. తన తప్పుకు భగవంతుడు సరయిన శిక్ష వేసినాడు అని తలచి యింక జీవితములో అటువంటి తప్పు చేయకూడదని నిశ్చయించుకున్నది." నాకు తెలివి వచ్చినది.
భగవంతునిపై నమ్మకము కుదిరినది. మనసులోని బాధ తొలగిపోయినది.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment