Wednesday 15 February 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (27)




 

 
సాయి.బా.ని.. డైరీ -  1994  (27)

29.09.1994

దేశములో (సూరత్) ప్లేగు వ్యాధి విపరీతముగా ప్రబలుచున్నది అనే వార్తలు వినవస్తున్నాయి.  రాత్రి భయముతో శ్రీ సాయికి నమస్కరించి ప్లేగువ్యాధి నుండి రక్షణ పొందటానికి మార్గము చూపమని వేడుకొన్నాను. 


 శ్రీ సాయి చూపిన దృశ్యాల వివరాలు 1) సమాజములో చెడు అలవాట్లు పెరుగుతున్నపుడు వ్యాధులు అనే ఆయుధమువలన సామూహిక మరణాలు సంభవించును  2) ఆటలలో ఆరోగ్యవంతులే విజయము సాధించుతారు.  అనారోగ్యముతో వ్యాధులతో ఉన్నవారు మరణానికి తలవంచుతారు.  3) అంటువ్యాధులు బాగా ప్రబలుతున్న ప్రాతాలలో ఎక్కువగా ప్రయాణాలు చేయవద్దు.  విందులు,  వినోదాలలో పాల్గొనవద్దు  4) నీయింటి పరిసర ప్రాంతాలను శుభ్రముగా ఉంచుకొని వేపచెట్టు గాలి పీల్చు.

30.09.1994

నిన్నటిరోజున గృహస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము గురించి ఆలోచించినాను.  రాత్రి నిద్రకు  ముందు శ్రీ సాయికి నమస్కరించి గృహస్థ ఆశ్రమములో యుంటూ సన్యాసిలాగ బ్రతకటము గురించి తెలపమని వేడుకొన్నాను.  శ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన సూచనలు వాటి వివరాలు.

1) నీ బరువు బాధ్యతలు నిర్వర్తించటానికి మాత్రమే ఆలోచించు.

2) అనవసరపు విషయాలలో జోక్యము చేసుకోవద్దు.

3) ఆహారములో రుచులకు పోవద్దు.

4) పరుల సొమ్ము ఆశించవద్దు

5) పరస్త్రీల గురించి ఆలోచించవద్దు.

6) నీయింటనే ప్రశాంతముగా జీవించాలి అనే కోరికతో భగన్ నామ స్మరణ చేస్తూ జీవించాలి. 

01.10.1994

నిన్నటిరోజున శ్రీ సాయి తత్వము గురించి, శ్రీ సాయి శిరిడీలో జీవించిన కాలములోని సంఘటనలు గురంచి ఆలోచించినాను.  రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయిబంధువులు  ఆచరించవలసిన ముఖ్య విషయములు చెప్పు తండ్రీ" అని వేడుకొన్నాను.  శ్రీ సాయి చూపిన దృశ్యాలు సారాంశము.

1) నీకంటె బలవంతుడు నీచేత తప్పుడు పనులు చేయించటానికి పయత్నాలు చేస్తూ ఉన్నపుడు దానిని నీవు గ్రహించగలగిననాడు, తప్పుడు పనులు చేయటముకంటే అటువంటి బలవంతుల నుండి దూరముగా యుండటము  ఉత్తమ మార్గము.

2) ఎవరినైన వంచన చేసి జీవించటము పాపము, ఆత్మవంచన చేసుకొని జీవించటము మహాపాపము. 

02.10.1994

నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీ సాయ్కి నమస్కరించి, ఆధ్యాత్మిక విషయాలు చెప్పమని వేడుకొన్నాను.  శ్రీ సాయి చూపిన దృశ్యాల సారాంశము.

1) భగవంతుని తెలుసుకోవాలనె తపనతో ఆధ్యాత్మిక రంగములో ప్రవేశిస్థాము.  ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొంటు సాధన చేయడము ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందుతాము.  అటువంటి సమయములో చిన్న చిన్న విజయాలను సాధించుతాము.  విజయాలను సాధించినాము అనే గర్వముతో భగవంతుని ఉనికిని మర్చిపోయి పతనము చెందుతాము.  అందుచేత ఆధ్యాత్మిక  రంగములో ప్రయాణము చేసేటప్పుడు మనలోని అహంకారాన్ని ముందుగా సద్గురుని పాదాల దగ్గర విడిచి ముందుకు సాగిపోవాలి. 

2) ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము చేసేవానికి తోడుగా బంధువులు, మిత్రులు రారు.  సద్గురువు చూపు కాంతి కిరణాలుగా మన ప్రయాణములో సహాయపడతాయి.  

 (యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు 

No comments:

Post a Comment