Wednesday 22 February 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (33)


సాయి.బా.ని.స. డైరీ - 1994 (33)

09.11.1994

నిన్నటిరోజున ఆధ్యాత్మికపరమైన ఆలోచనలతో గడిపినాను. భగవంతుని అనుగ్రహము పొందవలెనంటే శాస్త్రాలు చదవాలా ! శాస్త్రపరమైన విధానాల్తో మాత్రమే భగవంతుని పూజించాలా! అనే విషయమై సలహా యివ్వమని శ్రీ సాయిని వేడుకొన్నాను.


రాత్రి కలలో శ్రీ సాయి చూపిన దృశ్యము నాకు కనువిప్పు కలిగించినది. "నా కుమారుడు (మూడు సంవత్సరాల వయస్సు) నా యింటిముందు పార్కులో ఉయ్యాల ఊగుతున్నాడు. 

నేను ఆనందముతో చూస్తున్నాను. తోటి పిల్లలు గట్టిగా ఊపుతున్నారు. ఆసమయములో నా కుమారుని చేతిపట్టు తప్పిపోయినది. పైనుంచి క్రిదకు పడిపోతున్నాడు. నేను ఏమి చేయలేని స్థితిలో "సాయి" అని గట్టిగా అరచి నిలబడి చూస్తున్నాను. నాకళ్ళను నేను నమ్మలేకపోయినాను. నాకుమారుడు గాలిలో తేలుతు నా యింటి గుమ్మముదగ్గరకు వచ్చి నేలమీదకు దిగినాడు. శ్రీ సాయినాధుడే నా పిల్లవానిని కాపాడి నాయింటి గుమ్మము దగ్గరకు చేర్చినారని నమ్మినాను. ఆ సమయములో నాభార్య నాకు అన్నము వడ్డించి టేబుల్ మీద పెట్టినది. శ్రీ సాయి నాకుమారుని ప్రమాదమునుండి కాపాడినారు అని నాభార్యకు చెప్పి, నాకోసము వడ్డించిన అన్నమును కృతజ్ఞతా భావముతో నాయింటి పూజామందిరములో ఉన్న శ్రీ సాయినాధుని విగ్రహమునకు అన్నముతో అభిషేకము చేసినాను. ఆ సమయములో నాయింటికి వచ్చిన ఒక స్నేహితుడు శాస్త్రప్రకారము అన్నముతో భగవంతునికి అభిషేకము చేయరాదు అన్నారు. నేను, "నాకు శాస్త్రాలలోని విషయాలు తెలియవు" నాకు భగవంతునిపై నమ్మకము మాత్రము ఉంది. ఆయన నాకుమారుని ప్రమాదమునుండి రక్షించినారు. ఆయనకు కృతజ్ఞతతో నేను తినవలసిన అన్నముతో అభిషేకము చేసినాను" అన్నాను. నిద్రనుండి మెలుకువ వచ్చినది.

10.11.1994

నిన్నటిరోజున జీవితములో సుఖ సంతోషాలు గురించి ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి జీవితములో సుఖ సంతోషాలను ఉదాహరణలుగా చూపించమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు.

1) రోడ్డుకు అడ్డముగా ఉన్న రాళ్ళు రప్పలను తొలగించి రోడ్డుమీద ప్రయాణీకులు సంతోషముగా ప్రయాణము చేస్తున్నపుడు నీమనసులో కలిగే భావాలు.

2) అనుకోని సంఘటనలలో చాలా సంవత్సరాల తర్వాత నీవు నీకుటుంబ సభ్యులను కలసినపుడు నీమనసులోని భావాలు.

3) నీవు మోటార్ సైకిల్ మీద ప్రయాణము చేస్తున్నపుడు రోడ్డుమీద ఎండలో నడవలేకుండ యున్న వ్యక్తికి నీ మోటార్ సైకిల్ మీద అతనిదగ్గరనుండి ఏమీ ఆశించకుండ అతనిని అతని గమ్యస్థానము చేర్చినపుడు నీమనసులోని భావాలు.

4) నీ చిన్న తనములో నీవు చదివిన బడి శిధిలావస్థలో ఉన్న అక్కడ కొద్ది క్షణాలు కూర్చుని చిన్ననాటి జ్ఞాపకాలతో సంతోషపడటము.

5) ముళ్ళ చెట్టుకు తియ్యటి పండ్లు బాగా కాసిన ఆచెట్టుపైకి ఎక్కి ఆపండ్లు కోసుకొని తినలేని స్థితిలో గాలికి ఆ చెట్టు వంగినపుడు నీవు కష్టపడకుండానే ఆ పండ్లను కోసిన క్షణములో నీ మనసుకు కలిగే సంతోషము.


6) నీవు ఆకలితో ఉన్నపుడు ఎవరైన ప్రేమతో చద్ది అన్నము పెట్టినపుడు నీలోని భావాలు.

7) నీవు నీ కుమారుని సైకిలు ముందు భాగాన్న కూర్చోపెట్టుకొని వాని భవిష్యత్ గురించి ఆలోచించుతు సైకిలు త్రొక్కుతున్నపుడు నీలోని భావనలు - సుఖ సంతోషాలకు ఉదాహరణలు.

నిద్రనుండి తెలివి వచ్చినది. ఒక్కసారి ఆలోచించినాను. ఈ సుఖసంతోషాలు అనేవి నీమానసిక స్థితి. అవి వేరేగా బయట దొరకవు. వాటిని నీవు నీలోనే వెదకి అనుభవించాలి అనే నిజాన్ని గ్రహించినాను.

12.11.1994

నిన్నటిరోజున జీవితములో కలిగే నిరాశ, నిరాశనుండి బయటపడే మార్గము గురించి ఆలోచించసాగినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి వీటిపై వివరణ యివ్వమని కోరినాను. శ్రీ సాయి ప్రసాదించిన దృశ్యాల వివరాలు. జీవితములో కొందరు వ్యక్తులు నీకు జరగవలసిన న్యాయాన్ని జరగనీయకుండ అడ్డుకొన్నపుడు నీలో నిరాశ ఆవహించుతుంది. నేను శారీరకముగా అవ్యక్తులను ఎదుర్కోలేని స్థితిలో ఉన్నపుడు నిస్పృహ ఆవహించుతుంది. అటువంటి సమయములో తెలివితేటలు (జ్ఞానాన్ని) ఉపయోగించి నీవు నీకు జరగవలసిన న్యాయాన్ని పొందటమె నిరాశ – నిస్పృహల నుండి బయటపడే మార్గము.   

(యింకా ఉంది)
సేవం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment