Tuesday 14 February 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (26)




సాయి.బా.ని.. డైరీ - 1994  (26)

19.09.1994

నిన్నటిరోజున శ్రీ సాయి అడుగుజాడలలో నడవాలని ఆలోచన వచ్చినది.  రాత్రి విషయముపై చాలా ఆలోచించి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సలహా ఇవ్వమని వేడుకొన్నాను. 


 శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో అన్న మాటలను సలహాలుగా స్వీకరించినాను.  వాటి వివరాలు.

1) పరస్త్రీ వ్యామోహము వదలిపెట్టు.  2) పట్టు పరుపులకై ప్రాకులాడక నేలమీద నిద్ర్రించటము నేర్చుకో.  3) భోజనములో రుచులకు పోవద్దు.  4) నీ జీవితములో నీ అవసరాలకు వస్తువులను గాని, ధనమునుగాని దొంగిలించరాదు.  5) రోగముతో బాధపడుతున్న రోగులకు (కుష్ఠురోగులకు) సహాయము చేయవలెను.  6) నీ హోదాను మరచి ఉన్నత హోదా కలిగిన వారితో స్నేహము చేయరాదు.  7) యితరుల మనసును నొప్పించకుండ జీవించాలి.  8) విశ్వాసానికి మారు పేరు కుక్క అని గుర్తు ఉంచుకోవాలి. 

23.09.1994

నిన్నటిరోజున శ్రీ సాయి తత్వము, శ్రీ సాయి సందేశాలు గురించి ఆలోచించినాను.  రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సాయి బంధువులకు సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను.  శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశాలు.
1) శ్రీ సాయి పూజను ఏకాంతముగా ప్రశాంతముగా చేయి.  శ్రీ సాయి పేరిట సేవను సాయి బంధువులతో కలసి చేయి.  2) నిజ జీవితములో నీప్రక్కవాడికి ముందుగా భోజనము పెట్టి ఆతర్వాత నీవు భోజనము చేయి.  ఆధ్యాత్మిక జీవితములో నీవు ముందుగా ఆధ్యాత్మిక భోజనము చేసి, జీర్ణించుకొని తర్వాతనే నీ ప్రక్కవాడికి ఆధ్యాత్మిక భోజనము పెట్టు. -  శ్రీ సాయి.

24.09.1994

నిన్నటిరోజున శ్రీ సాయి తత్వములో కొత్త విషయాలు తెలుసుకొన్నాను.  యింకా శ్రీ సాయి తత్వము తెలుసుకోవాలి అనే తపనతో రాత్రి శ్రీ సాయికి నమస్కరించి ఆధ్యాత్మిక సందేశము యివ్వమని   వేడుకొన్నాను.  శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో యిచ్చిన సందేశాలు.  1) ఆధ్యాత్మిక  రంగములో మొదటిసారి నడవటానికి శ్రీ సాయి (మాత) చేయిని ఆసరాగా తీసుకోవాలి.  ఒకసారి  నడక అలవాటు పడిన తర్వాత స్వతంత్రముగా నడవగలగటానికి కావలసిన  ఆశీర్వచనాలను శ్రీ సాయినుండి కోరాలి.  నీవు స్వతంత్రముగా ఆధ్యాత్మిక రంగములో  నడుస్తున్నపుడు కలిగే కష్ఠసుఖాలను, జయాపజయాలను, కీర్తి అపకీర్తిలను సమదృష్ఠితో చూడగలగిననాడు నీవు నిజమైన సాయి భక్తుడిగా నిలబడగలవు.  

24.09.1994  8 .ఎం.

టీ.వీ.లో శ్రీ సాయి మీద చక్కని కార్యక్రమము ప్రసారము అయినది.  అందులో ఒక భక్తురాలు శ్రీ సాయిని కోరిన కోరిక నా మనసులో చోటు చేసుకొంది.  "సాయినాధ - నేను నీపాదాల దగ్గర అగరవత్తిని.  నీ చిలిం లోని నిప్పుకణముతో నన్ను నేను వెలిగించుకొని నీపాదాల దగ్గర భూమిలో బూడిదగా మారి పంచభూతాలలో కలసిపోనీ."

 (యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment