Tuesday, 28 February 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (03)


సాయి.బా.ని.స.  డైరీ -  1995  (03)

05.02.1995

నిన్నటిరోజున శ్రీ సాయి సత్చరిత్రపై అనేక మంది రచయితలు తమకు తోచిన విధముగా వ్యాఖ్యానములు వ్రాయటము - చరిత్ర సంఘటనలనే మార్చి వేయటము నా మనసుకు చాలా బాధ కలిగించినది.  నేను ఏమీ చేయలేని స్థితిలో రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ఈపరిస్థితిపై నీ ఆలోచనలు తెలియచేయి తండ్రీ అని వేడుకొన్నాను.   


శ్రీ సాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి చేతిలో ఒక కొత్త గడియారాన్ని పట్టుకొని 

" గడియారము 1918 నాటిది.  ప్రజలు గడియారము రూపు రేఖలు మార్చగలిగినారే కాని గడియారపు యంత్రములోని పనితనాన్ని, గడియారపు ధ్వనిని మార్చలేదు సంతోషించు" అన్నారు.

07.02.1995

నిన్నటిరోజున, నాతోటివాడు కష్ఠపడి డబ్బు సంపాదించుకొంటున్నాడే అనే భావనతో న్నాను . అతను లక్షాధికారి అయినాడు అనే అసూయ నాలో పెరగసాగినది.  అసూయ అనేది నన్ను దహించి వేస్తున్నది.  రాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి అసూయను నానుండి తొలగించమని వేడుకొన్నాను.  శ్రీ సాయి కలలో చూపిన దృశ్యాలు నాలోని అసూయను పారత్రోలినది.  వాటి వివరాలు.

1) కళ్ళులేని భార్యభర్తలు (గుడ్డివారు) రోజు అంతా కష్ఠపడి సంపాదించిన డబ్బును నేను దొంగిలించినాను. 

 వారి యింట దొంగతనము చేసి పారిపోతున్న సమయములో వీధిలోనివారు నన్ను పట్టుకొన్నారు.  అందరు గుమిగూడి నన్ను కఱ్ఱలతో కొట్టసాగినారు.  నాకు నిద్రనుండి మెలుకువ వచ్చినది. యిటువంటి పరిస్థితికి కారణము నాలోని అసూయ కదా అని భావించి శ్రీసాయికి నమస్కరించి నిద్రపోయినాను.

శ్రీ సాయి చూపిన మరొక దృశ్యము 2) అది కాకినాడలోని మేము అద్దెకు ఉన్నయిల్లు (1964 - 65).  నాకు నాపొరుగువారిపై చాలా అసూయ.  ఒక ఫకీరు ;మాయింటికి వచ్చి అసూయ అనేది కుష్ఠురోగమువంటిది.  అది యితరులకు అంటుకోదు.  కాని నిన్ను మాత్రము పీడించి, పిప్పి చేస్తుంది. అందుచేత అసూయను నీనుండి తొలగించుకో అన్నారు.  కుష్ఠురోగము అనే మాటకు నేను భయముతో నిద్రనుండి లేచినాను.

శ్రీసాయి ఈవిధముగా నానుండి అసూయను తొలగించటానికి హెచ్చరిక చేసినారు అని భావించినాను.

08.02.1995

నిన్నటిరోజున, మనయింటికి అతిధి వస్తే ఏవిధముగా మర్యాద చేయాలి, ఆధ్యా త్మికముగా అతిధిని ఏవిధముగా భావించాలి అనే విషయాలు చెప్పమని శ్రీసాయిని వేడుకొన్నాను.  శ్రీ సాయి దృశ్యరూపములో చె ప్పిన విషయాలు.

1)      నీయింటికి వచ్చిన అతిధికి మర్యాద చేసి అతన్ని సంతోషపెట్టు.  అమర్యాద చేసిననాడు ఆవ్యక్తి పగపట్టి తగిన అవకాశము దొరికిననాడు ప్రతీకారము తీర్చుకొనుటకు ఎదురుచూస్తూ ఉంటాడు.  మనం ఎవరికైన బాకీ యుంటేనే వాళ్ళు అతిధిరూపములో మన యింటికి వస్తారు.
09.02.1995

నిన్నటిరోజున నాకుటుంబ సభ్యులలో ఒకరికి భార్యా వియోగము జరిగినది.  ఆయన వయస్సు సుమారు 60 సంవత్సరములు.  ఆయన తన బరువు బాధ్యతలు అన్నీ పూర్తిచేసుకొని ఏకాంతముగా యున్నారు.  మరి ఆయన తిరిగి వివాహము చేసుకొన్న మంచిదా !  కాదా ! అనే అలోచన నామనసులో కలిగినది.  యిటువంటి పరిస్థితిలో శ్రీసాయి సలహా ఏమిటి అని ఆలోచించుతూ రాత్రి నిద్రపోయినాను.  శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు. "జీవిత భాగస్వామి వియోగాన్ని మరచిపోవటానికి నీప్రేమను,  ప్రేమను నోచుకోని అనాధపిల్లలకు పంచిపెట్టు.  అంతేగాని భార్యవియోగములోని బాధలు మరచిపోవటానికి మాత్రము తిరిగి వివాహము చేసుకోరాదు.  అది అనారోగ్యముతో ఉన్నవాడు త్రాగుడుకు బానిసగా మారినట్లు అగుతుంది. అందు చేత తిరిగి వివాహము వద్దు."

(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment