సాయి.బా.ని.స. డైరీ - 1998 (02)
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
10.01.1998
శ్రీ సాయి నిన్నరాత్రి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నీగత జీవితములో జరిగిన సంఘటనలకు నీవు సాక్షీ భూతుడివిగా మిగిలిపోయినావు. గత జీవిత ఆలోచనలకు విలువ ఇవ్వరాదు. వర్తమానాన్ని నమ్ముకొని ప్రశాంతముగా జీవించు.
2) వర్తమానములో నీవు పూర్తి చేయవలసిన బాధ్యతలు మిగిలియున్న భగవంతుని సహాయముతో వాటిని పూర్తి చేయి. ఆతర్వాత వాటి గురించి ఆలోచించకుండా ఆధ్యాత్మిక రంగములో ముందుకు సాగిపో.
3) భగవంతుడు కొందరికి మంచి గొంతును ఇచ్చినాడు, కాని వారు భగవంతుని కీర్తించటానికి ఆలోచించరు కదా. పైగా, ఎప్పుడూ తిండిమీద ధ్యాసతో జీవితాన్ని కొనసాగించుతారు. భగవంతుడు కొందరికి ఆకలిని తీర్చడానికి గోధుమపిండిని ఇచ్చినాడు. కాని, వారు దానిని కలిపి రొట్టెగా చేసుకొని తినడానికి బధ్ధకముతో ఆపిండినే తినుచున్నారు.
అంటే ఎవరికి ఏది ప్రాప్తమో వారికి అదే దొరుకుతుంది అని చెప్పక తప్పదు.
14.01.1998
శ్రీసాయి నిన్నరాత్రి కలలో ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నిత్యము భగవంతుని స్మరించుతు నీసంపాదననుండి రోజుకు ఒక రూపాయి నమ్మకాన్ని నాకు సమర్పించు. భగవంతుని అనుగ్రహము అనే అక్షయపాత్ర నీవు పొందేలాగ నీకు నేను సహాయము చేస్తాను.
2) భక్త ప్రహ్లాదుని ఆదర్శముగా తీసుకొని అతను పయనించిన మార్గములో ప్రయాణము చేస్తు భగవంతుని అనుగ్రహము సంపాదించు.
3) క్రిందటి జన్మలో నీవు నీతల్లితండ్రులతో కలసి రైలు, బస్సు, టాంగా ఎక్కి శిరిడీకి వచ్చి నాకు నమస్కరించినావు.
4) ఈనాడు నీజీవితములో నీతో బంధాలు ఉన్న నీరక్త సంబంధీకులు, నీబంధువులు, నీస్నేహితులు క్రిందటి జన్మనుండి నీతో సంబంధము ఉన్నవారే. ఈజన్మలో వారి అందరి ఋణాలు తీర్చుకొని నూతన జన్మకు మార్గము ఏర్పాటు చేసుకో.
20.01.1998
శ్రీసాయి నిన్నరాత్రి ఒక బాటసారి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) జీవితములో నీవు మంచి పనులను తెలిసి చేసిన లేక తెలియక చేసిన వాటికి మంచి ఫలితాలు పొందుతావు. మరి జీవితములో చెడ్డపనులు చేయడము మానివేసిన రోజున యింక నీవు చేసే పనులలో ఎంతో కొంత మంచి పనులు ఉంటాయి. దానివలన నీకు తెలియకుండానే మంచి ఫలితాలను పొందుతావు.
2) దాహముతో ఉన్నవాడికి త్రాగడానికి మంచినీరు ఇవ్వడము ఒక మంచిపని.
అటువంటి పని చేస్తున్నపుడు నీవు ప్రేమతో ఆపని చేసిన భగవంతుని ప్రేమను నీవు మంచి ఫలముగా పొందగలవు.
(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment