Monday, 25 June 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (13)


                              
     
                                 
                                         

26.06.2012 మంగళవారము  
ఓం సాయి  శ్రీ సాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కరెంటు కోత  వల్ల ప్రచురణకు ఇబ్బంది ఎదురయింది 


సాయి.బా.ని.స. డైరీ - 1998 (13)

12.08.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) యితరులు తమ గొప్పతనాన్ని చూపించుకోవడానికి నీముందు నాటకాలు ఆడుతారు.  అటువంటివారిని చూసి నీవు చిరాకుపడవద్దు. ఓచిరునవ్వు నవ్వి ఆనాటకానికి తెరపడేవరకు వేచి యుండు.  

2) ఎంత బలవంతుడు అయిన అన్నిరోజులు అతనివి కావు.  

ఏనుగుబలమైన జంతువు.  కాని దానికి మరణము ఆసన్నమైనపుడు మాత్రము దీనముగా కన్నీరు కార్చుతు  తన ప్రాణాన్ని వదులుతుంది.  అదే పరిస్థితిని ఈనాటి బలవంతులు రేపటి రోజున పొందుతారు అని గుర్తుంచుకో. 

19.08.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) నాభక్తుల మంచి చెడ్డలు చూడటము నాకర్తవ్యము.  వారు మంచి పనులు చేయడానికి నేను ప్రోత్సాహము ఇస్తాను.  





వారు చెడు సహవాసాలతో దొంగతనాలు చేస్తు ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను.  వారిని మందలించుతాను.  ఒకసారి చెబుతాను, రెండుసార్లు చెబుతాను.  ఆతర్వాత వారి ఖర్మకు వారిని వదలివేస్తాను.

2) మతము పేరిట హత్యలు చేయడము, మరియు ఆత్మ హత్యలును ప్రోత్సహించటమునకు నేని వ్యతిరేకిని. ప్రాణదానము చేయలేని మానవుడు ఒకరి ప్రాణాన్ని తీయడానికి, మరి తాను ఆత్మహత్య చేసుకోడానికి ఆభగవంతుడు అంగీకరించడు. 

3) మతము, సాంప్రదాయాలు, భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగపడాలి.  అంతేగాని, మతము పేరిట, కులాల పేరిట ఒకరిని యింకొకరు హింసించుకోవడము తగదు. 

4) సర్వజీవులలోను, క్రిమి కీటకాదులలోను, పచ్చని వరిపొలాలు, చెట్లు చేమలలోను, భగవంతుని చూడగలిగినవాడే నా నిజ భక్తుడు.    

02.09.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు నేను జీవితాంతమువరకు మర్చిపోలేను.

1) నీజీవిత ప్రయాణము రైలు ప్రయాణము వంటిది.  నీ పిల్లలు పెద్దవారు అయి వారి వారి రైళ్ళలో  వారు ప్రయాణము చేస్తున్నారు.  యిక నీభార్య నీతోపాటు రైలు ప్రయాణములో వేరొక పెట్టెలో కూర్చుని ప్రయాణము కొనసాగించుతున్నది.  ఆమెపై నీకు యింకా వ్యామోహము పోలేదు.  ప్రయాణము సాగుతు ఆగుతున్న ప్రతి స్టేషన్ లో ఆమె గురించి ఆలోచించుతు ఆమె యున్నపెట్టె దగ్గరకువెళుతు ఆమెతో మాట్లాడుతున్నావు.  ఈ హడావిడిలో నీపెట్టెలోని నీ సామానులు దొంగలు దొంగిలించినారు.  నీరైలు శిరిడీ స్టేషన్ లో నిన్ను వదలి వెళ్ళిపోయినది.  



నీభార్య తన పెట్టెలో అదే రైలులో ముందుకు వెళ్ళిపోయినది.  నీవు కట్టుబట్టలతో శిరిడీలోని రైలు ప్లాట్ ఫారం మీద నిలబడిపోయినావు. 




నీ స్నేహితులనుండి ధన సహాయముకోరడానికి నీలో అభిమానము అడ్డు వస్తోంది.  నాపిలుపు మేరకు నాదగ్గరకు వచ్చినావు.  యింక గత జీవితము గురించి ఆలోచించక నాతో కలసి పని చేసి ఆభగవంతుని చేరుకో.   

(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాదార్పనమస్తు 

No comments:

Post a Comment