Tuesday, 12 June 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (03)







12.06.2012  మంగళవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ - 1998 (03)

21.01.1998

శ్రీసాయి నిన్నరాత్రి ఒక స్వాతంత్ర్య సమరయోధుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) స్వేచ్చ - స్వాతంత్ర్యము యొక్క విలువ నీకు తెలియనంతవరకు నీవు బందీగా ఈశరీరములో యుంటు పడరాని బాధలు పడుతున్నావు.  నీగురువుయొక్క అనుగ్రహము పొందగానే ఈశరీరముపై విజయాన్ని సాధించి శరీరముపై మమకారమునుండి బయటపడినపుడు స్వాతంత్ర్యముయొక్క విలువ తెలుసుకోగలవు.   

2) జీవితములో నీపై నీకు నమ్మకము కలిగేలాగ జీవించటము నేర్చుకో.  నీస్వశక్తితో ఎంతపని చేయగలవు అనేది నీకు తెలిసిననాడు, నీవు నీపై అధికారుల ప్రాపకమును ఆశించవు.  జీవితాన్ని సుఖసంతోషాలతో ముందుకు సాగించుతావు.  

3) నీయింటికి వచ్చిన అతిధికి ముందుగా నీవు భోజనము పెట్టి ఆతర్వాత నీవు భోజనము చేసిన నీవు ఆభోజనమును నాకు పెట్టినట్లే.   
08.02.1998

శ్రీసాయి నిన్నరాత్రి కలలో నాదగ్గర బంధువు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీకుమారుడు ఉన్నత పదవిలో యున్నరోజున నీలో మదము (అహంకారము) రానీయకు.

2) నీవు ఎవరికైన సహాయము చేసినపుడు ఆవిషయము మర్చిపో.  లేకపోతే నీలో మాత్సర్యము (అసూయ) జనించుతుంది.

3) నీవు కన్యాదానము చేసిన తర్వాత నీకుమార్తె విషయములో ఎక్కువగా ఆలోచించకు. 
 నీనుండి కన్యాదానము స్వీకరించినవారు నీకుమార్తె బరువు బాధ్యతలు స్వీకరించవలసియున్నది.  కన్యాదానము తర్వాత నీకుమార్తె అత్తమామలు నిన్ను గుర్తించటములేదు అనే ద్వేషమును విడనాడు. 

4) స్కూల్ పిల్లలు ఆటస్థలములో డ్రిల్లు చేసేవిధముగా ఆధ్యాత్మిక రంగమైదానంలో నీవు సాధన చేయి.  అపుడు మద, మాత్స్ర్యాలు రాగద్వేషాలు నీనుండి తొలగిపోతాయి. 

11.02.1998

శ్రీసాయి నిన్నరాత్రి ఒక సన్యాసి రూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు.

1) శత్రువుపై పగ పట్టడము జంతువులకు సహజలక్షణము.  పగ వైషమ్యాలు వదలి క్షమాభిక్ష పెట్టడము మానవునికి భగవంతుడు ఇచ్చిన ప్రత్యేక లక్షణము.  మానవుడు ఈప్రత్యేక లక్షణము మరచిపోయి దానవుడుగా జీవించటములో అర్ధము లేదు.

2) జీవిత  పరీక్షలో పాల్గొటానికి నీకృషి నీవు చేయి.  ఫలితాన్ని నేను చూసుకొంటాను.  నాదగ్గరకు వచ్చేవారికి ఆధ్యాత్మికాన్ని సరళమైన వ్యావహారిక భాషలో బోధించి అదే భాషలో వారిని ప్రశ్నించి, వారికి ఫలితాన్ని ప్రసాదించుతాను. 

3) నాజీవితము నిరాడంబరానికి మారుపేరు. 

మరి నాజీవితము గురించి తెలిసికూడ నీవు నాకు బంగారు ఆభరణాలు, విలాసవస్తువులు కొని వాటిని నాదర్బారులో ఉంచటములో అర్ధము లేదు. 

(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment