Monday, 2 January 2012

బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు 10


బాబాతో సాయి.బా.ని.. అనుభవాలు 10


శ్రీ సాయి సచ్చరిత్రలోని 40 అధ్యాయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము. అందులో శ్రీసాయి 1917 సంవత్సరం హోలీ పండుగ తెల్లవారుజామున హేమాద్రిపంతుకు కలలో చక్కని దుస్తులు ధరించిన ఒక సన్యాసి రూపములో దర్శనమిచ్చి, హేమాద్రిపంత్ యింటికి మధ్యాహ్న్నము భోజనానికి వస్తానని తెలియచేశారు. భోజన సమయానికి ముందుగా ఒక పటం రూపంలో శ్రీసాయి వచ్చి తమ మాటను నిలబెట్టుకున్నారు. ఇటువంటి అనుభవాన్నే నాకుకూడా కలిగించి, శ్రీ సాయి తాను జీవించి ఉండగా తన భక్తులను ఏవిథంగా అనుగ్రహించారో ఇప్పటికీ అదేరీతిలో అనుగ్రహిస్తున్నారని తెలియచున్నది.

అది 1996 సంవత్సరం మార్చ్ నెల. ఒక ఆదివారమునాడు వేకువజామునే సాయి మా ఫ్యాక్టరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపంలో దర్శనమిచ్చి, మధ్యాహ్న్నము మాయింటికి భోజనానికి వస్తానని చెప్పారు. విషయాన్ని నేను ఉదయము నా భార్యకు తెలియచేసి మధ్యాహ్ న్నం రాబోయె అతిధి కోసం కూడా వంట చేయమని చెప్పాను. నాభార్య కూడా సాయి భక్తురాలయినప్పటికీ , మా కుటుంబంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారికి రాకపోకలు లేకపోవడం వల్ల అది సాధ్యమేనా అని సందేహించింది. ఏది యేమయినప్పటికి తను మాత్రం వచ్చే అతిధికి కూడా వంట చేసి ఉంచింది. మధ్యాహన్నం భోజనం వేళకు నేను పిలవకుండానే యెవరయినా వస్తారని నా మనస్సుకు అనిపించింది.

మధ్యాహ్న్నము ఒంటిగంటయినా ఎవరూరాలేదు. , ఇక, యింత వేళ దాటి యెవరుమాత్రం వస్తారని చెప్పి, నా భార్య ఆకలితో ఉండలేక ఒంటిగంట పావుకు భోజనానికి ఉపక్రమించింది. నేను కొంచెం అసహనంతో ఉన్నాను. సాయి తప్పకుండా ఏదొ ఒక రూపంలో వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నాను. నామనస్సు సాయి మీద నమ్మకము నా భార్యకు ఉన్న అపనమ్మకానికి మధ్య ఊగిసలాడటం మొదలెట్టింది. ఇక ఏమీ చేయలేక నా భార్య ఆదేశం ప్రకారం మధ్యాహ్న్నము రెండుగంటలకు భోజనానికి ఉపక్రమించాను. భోజన సమయంలో బాబా నామస్మరణే చేయసాగాను. నేను భోజనము పూర్తి చేసే సమయానికి మా యింటి కాలింగ్ బెల్లు మ్రోగింది. నేను యెవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తున్న సమయంలో నా భార్య తలుపు తెరిచి నా ఆఫీసులో నా దగ్గిర పనిచేస్తున్న కార్మికుడు శ్రీ సత్తెయ్య వచ్చినారని చెప్పింది.

సాధారణంగా నా ఆఫీసునుంచి నా యింటికి నన్ను కలవడానికి యెవరూ రారు. ఇదంతా కూడా సాయి ప్రేరణతో జరిగిందా అని మనసులో కలిగింది. నేను నా చేతులు కడుగుకుని అతనిని నా ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చుండబెట్టి "ఏమిటి సత్తెయ్యా ! వేళకాని వేళలో నా యింటికి వచ్చినావని అడిగాను. అతను చెప్పిన మాటలు మీకిప్పుడు తెలియపరుస్తున్నాను. "సారూ, మధ్యాహ్న్నము నా డ్యూటీ పూర్తి చేసుకుని బస్సులో యింటికి వెడుతూ, మీ వీధిలోంచి వెడుతుండగా ఆకలితో ఉన్న నాకు తినడానికి మీయింట ఏదయినా దొరుకుతుందనే ఉద్దేశ్యంతో మీయింటికి వచ్చినాను."

రాత్రి కలలో శ్రీ సాయి మా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపములో దర్శనమిచ్చి నా దగ్గిర పనిచేస్తున్న ఒక సాధారణ కార్మికుడి రూపములో నా యింట భోజనానికి రావడము నన్ను ఆశ్చర్య పరిచింది. అప్పటికే నేను, నా భార్య భోజనము పూర్తి చేసి ఉన్నాము. మరి వచ్చిన అతిధికి ఎంగిలి భోజనము పెట్టడానికి మనస్సు అంగీకరించలేదు. అప్పుడు నా భార్య ఉదయము తాజాగా చేసిన జంతికలను ఒక ప్లేటులో తెచ్చి శ్రీ సత్తెయ్యకు తినమని కోరినది. నా భార్య చేసిన మంచి పనికి నా హృదయము ఆనందముతో నిండిపోయినది. ఆనాడు హేమాద్రిపంత్ యింటికి బాబా నీవు సన్యాసి రూపములో వస్తానని చెప్పి పటము రూపములో వచ్చి హేమాద్రిపంత్ ను వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించావు కదా, మరి రోజు నీవు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపములో వస్తానని చెప్పి ఒక సాధారణ కార్మికుడి రూపములో వచ్చినావు కదా ఏది యేమైనా నీ ఆశీర్వచనాలు మాకు ప్రసాదించమని వేడుకున్నాను. అదే సమయములో మా ఆఫీసు కార్మికుడు శ్రీ సత్తెయ్య నా భార్య పెట్టినటువంటి జంతికలను కడుపారా తిని ఒక గ్లాసు మంచినీరు త్రాగి ఒక చిరు నవ్వు చిందించి వెళ్ళివస్తానని చెప్పినాడు. శ్రీ సాయి శ్రీ సత్తెయ్య రూపములో మనింటికి వచ్చినారని నాభార్య చెప్పటము నాకు నాభార్యకు సాయిపై ఉన్న నమ్మకమును రెట్టింపు చేసింది.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment