Wednesday, 4 January 2012

సాయి.బా.ని.స. డైరీ 5 వ.భాగము

సాయి.బా.ని.స. డైరీ 5 వ.భాగము సాయి.బా.ని.స. డైరీ 1993 09.03.1993 మంగళవారము శ్రీ సాయి నిన్న రాత్రి కలలో మంచి సందేశాన్ని దృశ్య రూపములో చూపించి కనువిప్పు కలిగించినారు. "కొంత మంది సాయి భక్తులు ఆంధ్రప్రదేశ్ వదలి యితర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు. నేను కూడ వాళ్ళలాగ వెళ్ళాలా వద్దా అనే అలోచనలతో చికాకు పడుతున్నాను. ఒక అజ్ఞాత వ్యక్తి నా దగ్గరకు వచ్చి అన్నారు. "నా యిల్లు - నా వాళ్ళు - నా ఊరు అనే మమకారము యుండరాదు. మనము ఎక్కడ యుంటే అదే మన ఊరు. అక్కడి ప్రజలే మనవాళ్ళు. నేను ఎక్కడినుండి వచ్చినది నాకే తెలియదు. అందరు నా వాళ్ళే అన్ని ప్రదేశాలు నావే". ఉదయము నిద్రనుండి లేచిన తర్వాత ఆలోచించినాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి మంచి సందేశాన్ని యిచ్చినారు కదా అని భావించినాను. శ్రీ సాయి సత్ చరిత్ర 5 వ అధ్యాయములో జవహరు ఆలీ అనే కపట గురువు శ్రీ సాయిని తనతో పాటు రహతా గ్రామానికి తీసుకొని వెళ్ళినపుడు శ్రీ సాయి షిరిడీపై ఏ విధమైన వ్యామోహము చూపకుండ రహతా వెళ్ళిపోయినారు. రహతా ప్రజలుతోను, జవహరు ఆలీతోను శ్రీ సాయి చక్కగ కలసిమెలసి బ్రతికినారు రహతా గ్రామములో. శ్రీ సాయి ఏ ఒక గ్రామముపైన ఏ కొంతమంది భక్తులపైన మమకారము చూపలేదు అని మనము గ్రహించాలి. 13.03.1993 శనివారము నిన్నరాత్రి మనసులో ఆందోళన గుండెలలో నొప్పితో బాధపడుతు శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి రాత్రి కలలో చూపిన దృశ్యాలు "ఒక చాకలివాడు నా మురికి బట్టలు ఉతికి చక్కగా ఎండపెట్టి యిస్త్రీ చేసి నాకు యిస్తున్నాడు. అతను 12 రూపాయలు అడిగిన నేను రెండు రూపాయలు మాత్రము యిస్తాను అని చెప్పి రెండు రూపాయలు యిచ్చినాను. అతను చిరునవ్వుతో రెండు రూపాయలు స్వీకరించినారు." యింకొక దృశ్యములో నేను ఒక స్కూటరు మీద ప్రయాణము చేయుచున్నాను. రోడ్డుమీద గత జీవితములోని స్త్రీ, పురుష స్నేహితులు నన్ను పలకరించుతున్నారు. నేను స్కూటర్ బ్రేక్ వేసిన అది ఆగటములేదు. నా స్కూటర్ ను నేను నడుపున్నానా లేక ఏదైన అజ్ఞాత శక్తి నడుపుతున్నదా అనే భావన కలిగినది. ఉదయయము శ్రీ సాయి సత్ చరిత్ర నిత్యపారాయణలో 22 వ. అధ్యాయము చదివినాను. ఆ అధ్యాయములో శ్రీ సాయి బాపు సాహెబు బుట్టితో అంటున్న మాటలు "మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక" నాతో స్వయముగా అన్న అనుభూతిని పొందినాను. ఉదయము 11 గంటలకు ఆఫీసులోని ఆసుపత్రికి వెళ్ళి ఈ.సీ.జీ. పరీక్ష చేయించుకొన్నాను. డాక్టరు అన్న మాటలు "మీ మనసులో ఆందోళన చికాకులు తొలగించుకోండి మీ ఆరోగ్యము చక్కగా ఉంటుంది." శ్రీ సాయి స్వయముగా డాక్టరురూపములో నాతో అన్నారు అనే భావన కలిగినది. యిక రెండవ దృశ్యము -- నేను నడుపుతున్న ఆధ్యాత్మిక స్కూటర్ స్టార్ట్ చేసి ప్రయాణము సాగించుచున్నాను. కాని దానికి బ్రేక్ వేయటము నా వల్ల కావటములేదు. ఆ స్కూటర్ స్టార్ట్ చేయటము వరకే నా వంతు. ఆస్కూటర్ నడపటము బ్రేక్ వేయటము శ్రీ సాయి వంతు. 19.03.1993 శుక్రవారము నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి ప్రశాంతముగా నిద్రపోయినాను. రాత్రి కలలో నేను పొందిన అనుభవాలు నెమరు వేసుకొన్నాను. వాటి వివరాలు . "నా జీవితములో ఒక రాత్రి నాకు తెలియకుండానే సాయి మిఠాయి భండారు నకు వెళ్ళి అక్కడి మిఠాయి తిని ఆ దుకాణములో నిద్రపోయినాను. నేను నిద్రలో యుండగా ఆ మిఠాయి దుకాణము యజమాని నా కంటి జబ్బును కనిపెట్టి నా కన్నులమీద జీడి గింజల చూర్ణము లేపనము పూసి ఆకులతో కట్టుకట్టినారు. నేను నిద్రలేచిన తర్వాత ఆయన నాకళ్ళకు ఉన్న కట్టు తీసి నీళ్ళతో కడిగి అద్దములో చూడమన్నారు. నేను ఆ మిఠాయి దుకాణమునకు రాక ముందు ఉన్న చూపుకు జీడిగింజల చూర్ణము లేపనముతో వైద్యము తర్వాత చూపులో చాల తేడాయున్నది. ఒక కన్ను చాలా బాగా కనబడుతున్నది. యింకొక కన్నులో యింకా కొంచము మసక యున్నది అన్నాను. ఆ మిఠాయి దుకాణము యజమాని అన్నారు. " ఈ దుకాణములోనికి రాకముందు యిది అంటరానివాని దుకాణము అనేభావన నీలో యుండేది. యిక్కడ మిఠాయి తిన్న తర్వాత ఆ భావన పోయినది అందుచేత ఒక కన్ను బాగా కనిపించుతున్నది". మరి రెండవ కన్ను యింకా సరిగా కనిపించటములేదు కదా అని అన్నాను. దానికి ఆయన యిచ్చిన సమాధానము " ఆ కన్ను పూర్తిగా బాగుపడాలి అంటే నీలో నేను బ్రాహ్మణుడిని అనే అహంకారము పూర్తిగా తొలగాలి అపుడు ఆ కన్ను కూడ బాగుపడుతుంది" అన్నారు. అక్కడికి కొందరు సాయి బంధువులు ఖాళీపెట్టెలు తెచ్చి లోపలికి వెళ్ళి దాని నిండ రకరకాల మిఠాయి నింపుకొని వెళ్ళిపోతున్నారు. నేను ఆ మిఠాయి దుకాణము యజమానిని నా స్నేహితులు తమ పెట్టెలలో ఏమి నింపుకొని వెళుతున్నారు అని అడిగినాను. నా ప్రశ్నకు ఆ మిఠాయి దుకాణము యజమాని "నా ఆధ్యాత్మిక ఖజాన నిండుగా యున్నది. నీ స్నేహితులు ఖాళీ పెట్టెలు తెచ్చి దానినిండ ఆధ్యాత్మిక ఖజానా నింపుకొని వెళుతున్నారు" అని అన్నారు. ఈ దృశ్యాలను ఆలోచించుతుంటే శ్రీ సాయి సత్ చరిత్రలోని 28 వ. అధ్యాయములోని మేఘశ్యాముని వత్తాంతములోని బాబా మాటలు "నీవు గొప్పజాతి బ్రాహ్మణుడవు. నేనా తక్కువజాతివాడిని. నీవిచటకు వచ్చినచో నీకులము పోవును. కనుక వెడలిపొమ్ము." నాచెవిలో వినిపించసాగినాయి. నా స్నేహితులు ఖాళీ పెట్టెలు తెచ్చుకొని వాటినిండ ఆధ్యాత్మిక ఖజాన నింపుకొని వెళుతూఉంటే శ్రీ సాయి సత్ చరిత్ర 32 వ. అధ్యాయములో శ్రీ సాయి అన్నమాటలు " నా సర్కారుయొక్క ఖజాన పొంగిపోవుచున్నది. త్ర వ్వి ఈ ధనమును బండ్లతో తీసుకొని పొండు" నా చెవిలో వినిపించసాగినాయి. నా దృష్ఠిలో ఆ మిఠాయి దుకాణుదారుడు శ్రీ సాయి. ఆయన దృష్ఠిలో జాతి, కుల, మత భేద భావాలు లేవు. ఆయన దగ్గరకు వెళ్ళిన ప్రతి భక్తునికి ఆధ్యాత్మిక ఖజాన పెట్టెల నిండా నింపి ఇస్తారు. సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment