Wednesday 4 January 2012

సాయి.బా.ని.స. డైరీ 1993 7 వ.భాగం

సాయి.బా.ని.స. డైరీ 1993 7 వ.భాగం సాయి.బా.ని.స. డైరీ - 1993 23.03.1993 సోమవారము ఈ రోజున "సాయిబాబా" ఆధ్యాత్మిక వైజ్ఞానిక పక్షపత్రిక ఒంగోలునుండి వచ్చినది. అందులోని ఆఖరి పేజీలోని విషయాలు నన్ను చాలా ఆకట్టుకొన్నాయి. వాటి వివరాలు "మద్దుషా అనే ఫకీరు షిరిడీకి వచ్చి శ్రీ సాయిని రూ.700/- కోరుతారు. శ్రీ సాయి తన భక్తులకు రూ.700/- ఇచ్చి మద్దూషాకు యివ్వమని చెబుతారు. ఆ భక్తులు ఆ సొమ్ములోనుండి రూ.200/- దొంగిలించి మద్దూషాకు రూ.500/- ఇస్తారు. మద్దూషా బాబా దగ్గరకు వచ్చి తన బాధను వెళ్ళబుచ్చుతారు. శ్రీ సాయి ఆయనను ఓదార్చి పంపించి వేస్తారు. మద్దూషా షిరిడీ వదలి నీం గాం కు చేరుకొనేసరికి మద్దూషాకు శ్రీ సాయి రూ.200/- ఇర్రన్ షా అనే భక్తుడి ద్వారా పంపుతారు. అపుడు మద్దూషా సంతోషపడతారు. ఈ సంఘటనపై కొంతసేపు ఆలోచించినాను. తాను యితరులకు యిచ్చిన 700 రూపాయలలో 200 రూపాయలు దొంగలించబడినా శ్రీ సాయి ఆ దొంగలను ఏ విధముగాను నిందించలేదు. దొంగతనము చేసిన వ్యక్తి పూర్తిసొమ్మును దొంగిలించలేదు. తనకు అవసరమైన 200 రూపాయలు మాత్రమే దొంగిలించినారు. బాబా తిరిగి యింకొక భక్తునితో 200 రూపాయలు మద్దూషా భక్తునికి చేరేలాగ చూసినారు. దీనితో సాయి బంధువులు తెలుసుకోవససిన విషయము ఏమిటీ. బాబా చెప్పిన సూక్తి "నా భక్తునికి ఏది అవసరమో అది తీరుస్థాను. ఏది మేలో అదే చేస్తాను". మరి నా విషయములో శ్రీ సాయి చేసిన మేలు జ్ఞాపకానికి వచ్చినది. నేను నా ఆఫీసులో ధనము మీద అత్యాశతో 2000 రూపాయలును ఒక స్కీములో పెట్టి మోసపోయి శ్రీ సాయి పటముముందు కన్నీళ్ళు కార్చినాను. శ్రీ సాయి ఈ సంఘటన జరిగిన ఒక సంవత్సరము లోపలే ఒక మధ్యవర్తి ద్వారా "యిటువంటి స్కీం లలో చేరరాదు. అత్యాశకు పోరాదు" అనే సందేశము యిచ్చి నాకు 2000 రూపాయలు ముట్టేలాగ చూసినారు. 38 వ. అధ్యాయములో హేమాద్రి పంతు అంటారు "ఓ సాయి నీ పాదాలు నాశ్రయించినవారి బాధలను తొలగించి నిన్ను శరణు జొచ్చినవారిని పోషించి రక్షించెదవు" నిజము అని నమ్ముతాను. 02.04.1993 శుక్రవారము నిన్న రాత్రి నిద్రకు ముందు నిన్నటి దినములో జరిగిన సంఘటనలు జ్ఞాపకము చేసుకొన్నాను. నిన్నటిరోజు శ్రీరామ నవమి. నా భార్య యింటిలోనికి రాకూడని కారణముగా పూజ ఘనముగా చేయలేదు. పూజలో రెండు ద్రాక్షపళ్ళు నైవేద్యముగ పెట్టినాను. నిన్నటి రోజున ఎవరూ నాయింటికి శ్రీరామనవమి ప్రసాదము తీసుకోవటానికి రాలేదు. నేను సాయంత్రము వీధి గుమ్మములో కూర్చుని ఆలోచించుతూ ఉన్నాను. యింతలో ఒక పెద్ద కుక్క నాయింటి గుమ్మము దగ్గరకు వచ్చి నన్ను, నా యింటివైపు కొంచెము సేపు చూసి నా యింటి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయింది. నా మనసులో ఒక ఆలోచన వచ్చినది. శ్రీ సాయి మానవరూపములో నా యింటిలోనికి రాలేకపోయినా కుక్క రూపములో నా యింటిముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించి నా యిటిచుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయినారు అని భావించినాను. రాత్రి కలలో శ్రీ సాయి నా ఆఫీసులో పనిచేస్తున్న కాజువల్ లేబర్ నరసిం హ రూపములో దర్శనము యిచ్చి నా చేతికి రెండు పెద్ద సైజు శీతాఫలాలు తినమని యిచ్చినారు. నేను వాటిని పూర్తిగా తినకుండా నా పాలిట సాయి అయిన నా పినతండ్రి శ్రీ ఉపాధ్యాయుల సోమయాజులుగారికి కూడ కొంచము యిచ్చినాను. యింతలో మెలుకువ వచ్చినది. ఈ కల గురించి ఆలోచించినాను. నా ఉద్దేశములో నా భార్య యింటిలోనికి రాకూడని పరిస్థితి శ్రీ సాయికి తెలుసు. అందుచేత ఎవరూ శ్రీ రామనవమి ప్రసాదము తీసుకోవటానికి రాలేదు. పూజలో నేను రెండు ద్రాక్షపళ్ళు నైవేద్యము పెడితే శ్రీ సాయి నాకు రెండు శీతాఫలాలు యిచ్చినారు. ఆ శీతాఫలాలను నేను కలలో నాపాలిట సాయి నా పినతండ్రికి యివ్వటము నా అదృష్ఠము. 35 వ. అధ్యాయములో కాకా మహాజని పొందిన అనుభూతి 32 వ. అధ్యాయములో హోళీ పండుగకు తన భక్తులను ఉపవాసము ఉండనీయను అని చెప్పటము రాత్రి కలలో శీతాఫలాలను నా పినతండ్రితో పంచుకొని తినటమునకు నిదర్శనము. 05.04.1993 సోమవారము నిన్నరాత్రి కలలో శ్రీ సాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ విజయభాస్కర్ రెడ్డి రూపములో నా యింట చాలా సంతోషముగా గడిపినారు. ఉదయము నిద్ర లేవగానే స్నానముచేసి నిత్య పారాయణ ప్రారంచించినాను. 46 వ. అధ్యాయములో " శ్యామాకు చక్కని రాజ లాఛనములతో స్వాగతము యివ్వబడెను. అతనిని ఏనుగుపైన కూర్చుడబెట్టి ఊరేగించిరి" అనే వాక్యాలు చదువుతుంటే ఉదయము 7 గంటలకు రేడియోనుండి వార్తలలోని ముఖ్యవార్త - "ఉప ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ విజయభాస్కర్ రెడ్డిగారు 30,000 ఓట్ల మెజారిటీతో గెలచినారు" - ఆ వార్త వింటూ ఉంటే రాత్రి కలలో శ్రీ సాయి విజయభాస్కర్ రెడ్డిగారి రూపములో నా యింట సంతోషముగా గడపటానికి అర్థము తెలిసినది. శ్రీ సాయి అందరిలోను ఉన్నారు - అన్ని ప్రదేశాలలోను ఉన్నారు అనేది గ్రహించగలిగినాను. 12.04.1993 సోమవారము నిన్న రాత్రి కలలో శ్రీ సాయి ఫకీరు రూపములో తన కోపాన్ని ప్రదర్శించినారు. ఆ కోపము తర్వాత చక్కని సందేశాన్ని ఇచ్చినారు. వాటి వివరాలు " అది ఏ.ఎస్. రావ్ నగర్ లోని ఓ పెద్ద హోటల్. నేను నా స్నేహితులతో కలసి ఆ హోటలుకు భోజనానికి వెళ్ళినాను. ఆ హోటల్ యజమానిలో శ్రీ సాయి రూపురేఖలు కనిపించుతున్నాయి. నేను నా మితృలు తిన్నది తక్కువ వ్యర్థము చేసినది ఎక్కువ. ఆ హోటల్ యజమాని మా దగ్గరకు వచ్చి కోపముతో మీరు తిన్నది తక్కువ దానికి బిల్లు కట్టమని నేను అడగను. మీరు పారవేసిన భోజనానికి వెయ్యి రూపాయల బిల్లు వేస్తున్నాను. కట్టండి. అని గట్టిగా అరుస్తారు. నేను నా మితృలు మాటలురాక నిలబడిపోయినాము. అపుడు ఆయన శాంతించి "అన్నము పరబ్రహ్మ స్వరూపము . తినే పట్టెడన్నము భగవంతునికి కృతజ్ఞతా పూర్వకముగా నివేదన చేసి తినాలి" అన్నారు. శ్రీ సాయి యొక్క రౌద్ర రూపము, శాంత స్వరూపము కలలో చూడగలిగినాను కదా అనే ఆలోచనలతో నిద్ర లేచినాను. నిద్రలో శ్రీ సాయి యిచ్చిన చక్కని సందేశము గురించి ఆలోచించసాగినాను. నా ఆలోచనలు 38 వ. అధ్యాయములోని " ఆహారమే పరబ్రహ్మ స్వరూపము" 24 వ. అధ్యాయములో "ఆహారమును మొదట భగవంతునికి అర్పించి, ఆ భుక్త శేషమునే మనము భుజించవలెను" అనే వాక్యాలుతో ఏకీభవించినాయి. (ఇంకా ఉంది) సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment