Wednesday 4 January 2012

సాయి.బా.ని.స. డైరీ 7 వ. భాగము

సాయి.బా.ని.స. డైరీ 7 వ. భాగము 15.11.1992 నిన్నటి రాత్రి కలలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో అన్నారు. పర స్త్రీ వ్యామోహము మంచిది కాదు. పది మందిలో భార్యపై మోహము చూపించటము మంచిది కాదు అని హెచ్చరించినారు. ఈ హెచ్చరిక శ్రీ సాయి సత్ చరిత్ర 49 వ. అధ్యాయములో శ్రీ సాయి నానా సాహెబు చాందోర్కరుతో అన్న మాటలను గుర్తు చేసినాయి. 21.11.1992 నిన్నటి రాత్రి బధ్ధకముతో నిద్ర పోయినాను. నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించినాను. కాని రాత్రి శ్రీసాయి ఇచ్చే సూచనలు, సందేశాలు వ్రాసుకోవటానికి పుస్తకము, పెన్ను తలదగ్గర పెట్టుకోలేదు. రాత్రి కలలో శ్రీ సాయి ఎన్నో కొత్త విషయాలు చెప్పినారు. ఉదయము ఒక్కటి జ్ఞాపకము లేదు. యిది విచిత్రము అనిపించింది. ఈ సంఘటనతో నేను గ్రహించినది ఏమిటంటే శ్రీ సాయి ఇచ్చే సూచనలు సందేశాలను గ్రహించటానికి సాయి భక్తులు అనుక్షణము ఎదురు చూస్తూ ఉండాలి. ఎలాగ అంటే ఆకాశమునుండి పడే నీటి బిందువును త్రాగటానికి ఎదురు చూసే చాతక పక్షిలాగ ఉండాలి. అటువంటి తపన, శ్రధ్ధ, సహనము ఉన్ననాడే మనము శ్రీ సాయినుండి మేలు పొందగలము. శ్రీ సాయి బందువుల జీవితము సార్ధకము అగుతుంది. శ్రీ సాయి సత్ చరిత్ర నాలుగవ అధ్యాయములో శ్రీ సాయి శ్రీ కాకా సాహెబు దీక్షిత్ తో అంటారు. "విఠలు పాటీలు వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని ఢృడముగ పట్టుము ఏమాత్రము అజాగ్రత్తగానున్నను తప్పించుకొని పారిపోవును". యిది శ్రీ సాయి విషయములో కూడ వర్తించుతుంది అని నా నమ్మకము. 24.11.1992 నిన్నటి రోజున నా కుమారునితో గొడవ పడినాను. ఈనాడు పిల్లలు పెద్దలయందు గౌరవ భావము లేకుండ ఎదురు సమాధానము చెబుతున్నారే అని బాధపడినాను. ఆ బాధలో శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి చూపిన దృశ్యము - నేను వృధ్ధాప్యములో వంటిమీద సరిగ వస్త్రము లేకుండా ఆకలితో హోటల్ కు వెడుతున్నాను. నా కుమారుడు ఎదురు పడినా సరిగా మాట్లాడకుండ వెళ్ళిపోయినాడు. హోటల్ వాళ్ళు నావంటి మీద సరయిన వస్త్రము లేదని నన్ను హోటల్ లోనికి రానీయలేదు. నేను ఆకలితో నా కుమార్తె యింటికి వెళ్ళినాను. ఆమె నన్ను గుమ్మములో నిలబెట్టి డబ్బు యిచ్చి ముందు రెడీ మేడ్ దుకాణమునకు వెళ్ళి చొక్కా కొని దానిని ధరించి తన యింటికి భోజనానికి రమ్మనమని చెబుతుంది. నా వృధ్ధాప్యములో నా ఆకలి బాధ ఎవరికి అవసరము లేదు అనే భావంతో విచారముతో రోడ్డుమీద వెళుతున్నాను. ఒకచోట అరటికాయ బజ్జీలు వేసే వ్యక్తి కనిపించినాడు. ఆ వ్యక్తి పిచ్చివాడులాగ ముసలివాడులాగ యున్నాడు. నన్ను ప్రేమతో పిలిచి వేడి నూనెలో అరటికాయ బజ్జీలు వేయించుతూ నాకు పెడుతున్నాడు. అతను వేడి నూనెలో గరిటె లేకుండ తన చేతినే పెట్టి, వేడి నూనెలో బజ్జీలు వేయించి నాలుగు బజ్జీలు వేడి నూనె నుండి చేతితో తీసి నాకు తినటానికి యిచ్చినాడు. అంత వేడి నూనెలో అతను చేయి పెట్టినా అతని చేయి కాలలేదు. నాకు మెలకువ వచ్చినది. నా వృధ్ధాప్యములో నామానసిక బాధను ఆకలి బాధను తొలగించగలిగినది శ్రీ సాయి అని నమ్మినాను. 25.12.1992 -- షిరిడీకి బస్సులో ప్రయాణము శ్రీ సాయి 15.03.92 నాడు యిచ్చిన ఆదేశానుసారముగా ఈ రోజు మధ్యాహ్న్నము రెండు గంటలకు నా భార్య, నాకుమారునితో కలసి షిరిడీకి బస్సులో బయలుదేరినాను. బస్సులో ప్రయాణము సాఫీగానే సాగుతున్నది. 27.12.1992 -- క్యాంప్ షిరిడీ నిన్నటి రోజున బూటీవాడలో మూడు హారతులకు వెళ్ళినాము. శ్రీ సాయి సమక్షములో నిలబడినపుడు పొందిన ఆనుభూతులు వర్ణించలేము. ఆయన చూపులలో గురు శిష్యుల ప్రేమ - తండ్రీ కొడుకుల అనుబంధము, మంచి స్నేహితుల మధ్య ఉన్న బంధమును చూడగలిగినాను. శ్రీసాయికి మన భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని తెలుసు అనే అనుభూతిని పొందినాను. శ్రీ సాయి తన భక్తులను ఉద్దేశించి 28 వ. అధ్యాయములో అన్న మాటలు "నా దర్శనము కొరకు గాని, పండగ దినము గడుపుటకు గాని, తీర్ధయాత్రకు పోవుటకుగాని అప్పు చేయరాదు" నాకు గుర్తు ఉన్నది. 25.12.92 నాడు షిరిడీకి రావటానికి నా దగ్గర ధనము లేదు. అప్పు చేయరాదు. ఏమి చేయాలి అనే ఆలోచనతో నా ఉద్యోగ రీత్యా ఒక స్నేహితునికి సహాయము చేసినాను. నేను చేసిన సాయమునకు ప్రతిఫలముగా షిరిడీ యాత్రకు కావలసిన ధనము ఆ స్నేహితుని దగ్గరనుండి స్వీకరించినాను. ఈ విషయము నాకు ఆ స్నేహితునికి మాత్రమే తెలుసును. కాని నిన్న రాత్రి శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో కలలో నా దగ్గరకు వచ్చి అన్న మాటలు "కొంతమంది సినిమాలు అప్పుచేసి చూస్తారు. మరికొందరు యితరుల ధనముతో ఫ్రీగా చూస్తారు". ఈ మాటలకు నాకు తెలివి వచ్చి లేచి కూర్చున్నాను. నేను ఈ షిరిడీ యత్రకు కావససిన ధనము ఒక మితృని దగ్గరనుండి స్వీకరించిన విషయము శ్రీ సాయికి ఏ విధముగా తెలిసినది అని ఆశ్చర్యము కలిగినది. శ్రీ సాయి సత్ చరిత్ర మూడవ అధ్యాయములో శ్రీ సాయి చెప్పిన మాటలు "మీరెక్కడయున్నప్పటికి ఏమి చేసినప్పటికి నాకు తెలియును అని బాగా జ్ఞాపకము ఉంచుకొనుడు. నేను అందరి హృదయాలను పాలించువాడను. అందరి హృదయాలలోను నివసించువాడను." మరి శ్రీ సాయి నా మితృని హృదయములోను, నాహృదయములోను ఉన్నారు కాబట్టి నేను రహస్యముగా నా మితృని దగ్గరనుండి లంచము తీసుకొనుట శ్రీ సాయికి తెలిసినది. అని నమ్ముతున్నాను. (ఇంకా ఉంది) సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment