Wednesday, 4 January 2012

సాయి బా ని స డైరీ 1992

సాయి బా ని స డైరీ 1992 1 వ.భాగము 14.03.1992 శనివారము నిన్నటి రోజున మగ పెళ్ళివారికి లాంఛనాల నిమిత్తము డబ్బు యిచ్చినాను. ఈ రోజు మధ్యాహ్న్నమున నిద్రలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి నీ కుమార్తె వివాహానికి సంతోషముగా డబ్బు ఖర్చు పెట్టు - నీకు డబ్బులోటు లేకుండ నేను చూసుకొంటాను అని అభయము యిచ్చిరి. 15.03.1992 నిన్న రాత్రి శ్రీ సాయి క్రిస్మస్ తాత రూపములో దర్శనము యిచ్చి క్రిస్మస్ పండగకు షిరిడీకి రమ్మనమని చెప్పినారు. 21.03.1992 నిన్న రాత్రి కలలో, ముస్లిం పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు బీదలకు అన్నదానము నిమిత్తము 5,001/- రూపాయలు ఖర్చు పెట్టాలి దర్గామీద ఒక చాదర్ కప్పలి అని నాతో అన్నారు. నా మనసులో ఏనాడో అజ్మీరు దర్గాకు వెళ్ళవలెనని కోరిక ఈ విథముగా శ్రీ సాయి గుర్తు చేసినారు అని తలచినాను. నా కుమార్తె వివాహము జరిగిన తర్వాత అజ్మీరు దర్గాకు వెళ్ళి కనీసము 5,001/- నయాపైసలు, ఒక చాదర్ సమర్పించాలి అని నిశ్చయించినాను. 22.03.1992 ఈ రోజు మధ్యాహ్న్నము నిద్రలో శ్రీ సాయి చనిపోయిన నా తండ్రి రూపములో దర్శనము యిచ్చి "గోపాల్ నేను నీ కూతురు పెండ్లికి వస్తాను" అని అన్నారు. మనసు సంతోషముతో నిండిపోయినది. 02.04.1992 నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ముందుగా నాకుమార్తె పెండ్లి శుభలేఖలు యెవరికి పంపవలెను తెలుపమని కోరినాను. శ్రీ సాయి రాత్రి అజ్ఞాత వ్యక్తి రూపములో అన్నారు, ముందుగా 1) పొట్టి దేవుడు (గణపతి) 2) పొడుగు దేవుడు (శ్రీ వెంకటేశ్వర స్వామి) తర్వాత నాకు పంపు అన్నారు. శ్రీ సాయి ఆదేశానుసారముగా ముందుగా పెండ్లి శుభలేఖలు రణతంభోర్ గణేశ్ మహరాజ్ (రాజస్థాన్) తర్వాత తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామికి మూడవ శుభలేఖ శిరిడి సాయినాథునికి పంపాలని నిశ్చయించినాను. 20.05.1992 నిన్న రాత్రి శ్రీ సాయి కలలో నాకు చూపిన దృశ్యము చాల సంతోషము కలిగించినది. "నేను నా భార్య ఓ బస్సులో ప్రయాణము చేస్తున్నాము. బస్సు ఒక పట్టణములో ఆగినది. నేను బస్సు దిగినాను. నా భార్య దిగలేదు. నేను బస్సు దిగి ఒక టాక్సి దగ్గరకు వచ్చినాను. ఆ టాక్సి డ్రైవరు ముస్లిం. అతను నన్ను తన టాక్సిలో ఎక్కమని కోరినాడు. నేను సంతోషముగా టాక్సీ ఎక్కి ఆ డ్రైవరుకు శివలింగము ఆకారములో ఉన్న కొబ్బరికాయ యిచ్చినాను. అతని చేతికి సెంటు పూసినాను. అతను సంతోషముగా టాక్సీని నడుపుతు నన్ను నా గమ్యానికి చేరుస్తానని మాట యిచ్చినాడు. శ్రీ సాయి తన భక్తులను వారి గమ్యానికి చేరుస్తానని ఆనాడు చెప్పిన మాట నిజమని నమ్ముతాను. 21.05.1992 గురువారము. నిన్న రాత్రి శ్రీ సాయి నందమూరి తారక రామారావు (ఎన్.టీ.ఆర్.) రూపములో దర్శనము యిచ్చి నన్ను 1964 సంవత్సరము లోనికి వెనకకు తీసుకొనివెళ్ళి నాతోపాటు శ్రీ వాడ్రేవు కోదండరామయ్య గారి యింటిలో (1964 సంవత్సరములో కాకినాడలో మా అద్దె యిల్లు) కొంచెము సేపు విశ్రాంతి తీసుకొని నన్ను ఆశీర్వదించి వెళ్ళినారు. ఈ కల ద్వారా శ్రీ సాయి నాకు తెలియచేసినది ఏమిటంటే నీవు నాకు 1964 సంవత్సరము నుండి తెలుసు అనేది గుర్తు ఉంచుకో. యిటువంటి సంఘటన శ్రీ సాయి సచ్చరిత్ర 33 వ అధ్యాయములో నాకు కనిపించినది. శ్రీ సాయి బాలబువ సుతార్ తో అంటారు, "యితను ఈ రోజు మొదటిసారిగా శిరిడీకి వచ్చిన యితనిని నేను నాలుగు సంవత్సరములనుండి ఎరుగుదును." దీనిని బట్టి శ్రీ సాయికి తన భక్తుల భూతకాలము కూడ తెలుసు అనేది నిజము అని నమ్ముతాను. 22.05.1992 శుక్రవారము ఈ రోజు సాయంత్రము నా కుమార్తె వివాహము జరిగిన తీరు గురించి ఆలోచించుతుంటే గుమ్మములో ఓ పల్లెటురివాడు వచ్చి తనకు ఒక అంగీ కావాలి అని అడిగినాడు. అతను తెల్ల పంచె, తెల్ల చొక్కా, తెల్లని గడ్డము, చేతిలో ఒక కఱ్ఱ ఒక సంచి కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూస్థూ ఉంటే నాకు శ్రీ సాయి ఈ రూపములో వచ్చినారనే భావన కలిగినది. నా కుమార్తె వివాహము రోజున (10.05.1992) శ్రీ సాయికి పంచెల చాపు నూతన వస్త్రాలు పూజారి ద్వారా గుడికి పంపించినానే - మరి 10.05.1992 నాడు ఆ పూజారి శ్రీ సాయికి నూతన వస్త్రాలు సమర్పించలేదా ఏమిటి? అనే ఆలోచనలతో యింటిలోనికి వెళ్ళి ఓ పాత చొక్కా తెచ్చి ఆ పల్లెటురివానికి ఇచ్చినాను. ఆ వ్యక్తితో చాలా విషయాలు మాట్లాడాలి అనే ఆలోచన రాగానే యింటికి వచ్చిన నా స్నహితులు నన్ను లోపలకి పిలిచినారు. ఆ పల్లెటురివాడు నేను యిచ్చిన పాత చొక్కాను తీసుకొని సంతోషముగా వెళ్ళిపోయినాడు. ఈ సంఘటన శ్రీ సాయి సత్ చరిత్రలో 33 వ. అధ్యాయములో హరి భావూ కార్లిక్ ఇవ్వదలచిన ఒక రూపాయిని శ్రీ సాయి నాసిక్ లోని కాలా రాముని మందిరములో నరసింగ మహరాజ్ రూపములో స్వయముగా అడిగి తీసుకొంటారు అనేది జ్ఞప్తికి వస్తోంది. 10.05.1992 నాడు నేను పూజారి ద్వారా శ్రీ సాయికి పంపిన నూతన వస్త్రాలు పంచెల చాపు మాత్రమే కదా. శ్రీ సాయికి చొక్కా కూడ కావాలని అనిపించి ఉంటుంది. బహుశ అదే కారణముతో పల్లెటురివాని రూపములో నా ఇంటికి వచ్చి పాత చొక్కా తీసికొని ఉంటారు అని నేను నమ్ముతున్నాను. (ఇంకా ఉంది)

No comments:

Post a Comment