Wednesday, 4 January 2012
సాయి.బా.ని.స. డైరీ 1993 1 వ. భాగము
సాయి.బా.ని.స. డైరీ 1993
1 వ. భాగము
06.01.1993 బుధవారము
శ్రీ సాయి నాకు మానవ జీవిత చక్రాన్ని అనేక సార్లు రైలు ప్రయాణముతో పోల్చి చెప్పినారు. నిన్న రాత్రి కలలో శ్రీ సాయి ప్రసాదించిన దృశ్యము నాకు కనువిప్పు కలిగించినది. వాటి వివరాలు "ఒక గుర్తు తెలియని రైల్వే స్టేషన్ లో నేను, నాభార్య, నాకుమారుడు రైలు ఎక్కినాము. రైలు బయలుదేరినది. టికెట్ కలక్టర్ వచ్చి నా దగ్గర ఉన్న టిక్కెట్ట్స్ చూసి మేము ఎక్కవలసిన రైలు అదికాదు కనుక ముందు స్టేషన్ లో దిగి పొమ్మని సలహా యిచ్చినారు. మరి వచ్చే స్టేషన్ లో దిగి తిరిగి ఏ రైలు ఎక్కాలి దయచేసి చెప్పమని వేడుకొన్నాను. ఆయన నానుండి రెండురూపాయలు దక్షిణ కోరినారు. ఆయన నానుండి దక్షిణ స్వీకరించి తిరిగి నేను ఎక్కవలసిన రైలు వివరాలు చెప్పినారు. ఈ వివరాలు అన్నీ నాభార్యకు, కుమారునికి చెప్పటానికి వారి సీట్లు దగ్గరకు వెళ్ళినాను. నేను టికెట్ కలక్టర్ తో మాట్లాడుతున్న సమయములో తాము ఎక్కినది సరి అయిన రైలు కాదని గ్రహించి నాభార్య, కుమారుడు వేగము పుంజుకొంటున్న రైలు నుండి దిగిపోయినారు. నామనసు పరి పరి విధాలుగా ఆలోచనలతో నిండిపోయినది. యింతలో రైలు ముందు స్టేషన్ లో ఆగినది. నేను రైలు దిగి అక్కడి స్టేషన్ మాస్టర్ ను వెనకటి స్టేషన్లో దిగిపోయిన నాభార్య, కుమారునికి టెలిఫోన్ చేయమని కోరుతాను. టెలిఫోన్ చేయటానికి వీలుపడదు అంటారు ఆ స్టేషన్ మాస్టర్. నేను నా భార్య, కుమారునిపై ప్రేమ బంధముతో ఆ స్టేషనునుండి రైలు పట్టాలపై వెనక స్టేషనుకు నడక ప్రారంభించినాను. నా వెనకాలనే ఒక రైలు యింజను మెల్లిగా వస్తున్నది. నేను నా ఆలోచనలలో మునిగి రైలు పట్టాలమీద నడుస్తున్నాను. ఆ రైలు యింజను నాముందు ఉన్న ఓ గోడను ఢీ కొట్టి ఆగిపోతుంది. నేను ఆ రైలు యింజనుకు, గోడకు మధ్య నిలబడిపోయినాను. ఆ రైలు యింజను తాకిడికి నా ముందు ఉన్నగోడ కూలిపోయినది. నాకు ఏవిధమైన గాయాలు తగలలేదు. ఆ రైలు యింజను తిరిగి వెనక్కి వెళ్ళిపోసాగినది. నాముందు గోడలేదు. రైలు పట్టాలు లేవు. ఒక విశాల మైదానము కనిపించుతున్నది. ఆ మైదానములో భూమి ఆకాశము కలిసినట్లుగా కనిపించుతున్నది. నన్ను ఏదో అజ్ఞాత శక్తి ఆ భూమి అకాశము కలిసే చోటికి రమ్మనమని ఆహ్వానించుతున్నది. ఆ ఆహ్వానము నాలో తెలియని శక్తిని ప్రసాదించినది. నేను అంతులేని నడక ప్రారంభించినాను. ఈ దృశ్యము గురించి ఆలోచించుతుంటే శ్రీ సాయి సత్ చరిత్రలో 33 వ. అధ్యాయములో బాబా అన్న మాటలు "బ్రహ్మము నిత్యము, ఈ జగత్తు అశాశ్వతము, ప్రపంచములో గల బంధువులు, కొడుకు గాని, తండ్రిగాని, తల్లిగాని, భార్య గాని మనవాండ్రు కారు. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చినాము. ఒంటరిగానే పోయెదము" నిజము అని నమ్ముతాను.
08.01.1993 శుక్రవారము
నిన్న రాత్రి శ్రీ సాయి ఒక పండు ముత్తయిదవ రూపములో దర్శనము ఇచ్చి నా భార్య చేత సంతోషిమాత పూజ చేయించసాగినారు. నా భార్య తలస్నానము చేసి నుదుట కుంకుమ బొట్టుతో చేతిలో నాలుగుపూలు తెచ్చి పూజ చేయసాగినది. పూజ చేయించుతున్న ఆ స్త్రీ నాభార్యను ఉద్దేశించి "నీవు పూజ చేస్తున్నపుడు పిసినిగొట్టు తనము చూపరాదు. నీకు పూలు కొనే స్థోమత ఉన్నపుడు దోశలినిండా పూలుతెచ్చి పూజ చేయాలి." స్త్రీలు దోశలినిండా పూలు తెచ్చి పూజ చేసిన రోజున వారి జీవితములో పూలకు కరువు ఉండదు. ఆ బాల వితంతువును చూడు ఆమె పిసినిగొట్టుతనంతో క్రిందటి జన్మలో ఏనాడు భగవంతునికి పూలతో పూజ చేయలేదు. అటువంటి పరిస్థితి ఏ స్త్రీకి రాకూడదని ఈ విషయము నీకు చెబుతున్నాను." అంటుంది. నాకు మెలుకువ వచ్చినది. ఒక్కసారి నేను నాభార్య క్రిందటి నెలలో షిరిడీలో గడపిన క్షణాలు గుర్తు చేసుకొన్నాను. 27.12.92 నాడు శ్రీ సాయి సమాథిపై నా భార్య నాలుగు గులాబి పూలుతో పూజ చేసినది. 28.12.92 నాడు శ్రీ సాయి సమాధిపై నా భార్య ఒక గులాబి పూవు ఉంచినది. ఈ విధముగా శ్రీ సాయి నాభార్యలో పిసినిగొట్టుతనమును చూపంచినారు. ఈ కలను గుర్తు చేసుకొంటుయున్నపుడు శ్రీ సాయి సత్ చరిత్రలో మూడవ అధ్యాయములో శ్రీ సాయిబాబా అన్న మాటలు "మీరెక్కడ నున్నప్పటికి ఏమి చేసినప్పటికి నాకు తెలియును అని బాగుగా జ్ఞాపకము ఉంచుకొనుడు.--- నేనే జగన్మాతను". గుర్తుకు వచ్చినవి.
19.01.1993 మంగళవారము
నిన్న రాత్రి శ్రీ సాయి విచిత్రమైన దృశ్యాన్ని ప్రసాదించినారు. దాని వివరాలు. నా యింటికి ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి తను నెయ్యి వ్యాపారిని అని చెప్పినాడు. "అందరికి ఇచ్చే ధరకంటే ఒక రూపాయి తక్కువ ధరకు నెయ్యిని నీకు యిస్తాను." అన్నారు. అదే సమయములో నా యింటి గోడమీద ఓ బల్లి ప్రాకుతున్నది. నేను ఆ వ్యక్తి దగ్గర నెయ్యి కొనబోతున్న సమయములో అతని భుజము మీద సంచిలో నుండి యింకొక బల్లి నేలమీదకు పడి గోడమీదకు ప్రాకిపోసాగినది. ఆ వ్యక్తి ఆ రెండవ బల్లిని చూసి "ఆ రెండవబల్లి కూడ వచ్చినదే" బాగుంది అన్నారు. నేను ఆ వ్యక్తి దగ్గర నెయ్యిని కొని కరగపెడుతూ ఉంటే వీథిలోనుండి ఒక స్త్రీ (బురఖా ధరించి ఉంది) నాయింటికి వచ్చినది. ఆమె తన ముఖముపై బురఖా తొలగించి నాకేసి చూసి నన్ను ఆశీర్వదించినది. నేను ఆమె పాదాలకు నమస్కరించబోతే ఆమె పాదాల బొటన వ్రేళ్ళదగ్గరనుండి రెండు చిన్న పాటి నీటికాలవలు మాదిరిగా నీరు ప్రవహించసాగినవి. నేను ఆశ్చర్యముతో నిద్ర లేచినాను. యిది అంత కలని తెలుసుకొని శ్రీ సాయి నామీద దయ ఉంచి నాకు ఇష్టమైన శ్రీ సాయి సత్ చరిత్రలోని 15 వ. అధ్యాయములోని చోల్కర్ చక్కెర లేని టీ మరియు రెండు బల్లుల కధ ఈ విధమైన దృశ్య రూపములో చూపించి రెండు సంవత్సరాలనుండి భోజనములో నేను నెయ్యి వాడకపోవటము గుర్తు చేసి తనకు నాగురించి అన్ని విషయాలు తెలుసును అని రూఢి చేసినారు. యిక 49 వ అధ్యాయములో నానా సాహేబు చందోర్కరుకు ఉన్న పర స్త్రీ వ్యామోహము వదిలించిన పధ్ధతిని శ్రీ సాయి నాపై ప్రయోగించి పరస్త్రీని తల్లివలె చూడవలెనని సూచించినారు. 4 వ.అధ్యాయములో శ్రీ సాయి తన పాదాల దగ్గరే గంగ యమున జలాలు కాలువలుగా పారటము శ్రీ దాసగణు మహరాజుకు చూపినారు. అదే అనుభూతిని నాకు కలలో ప్రసాదించినారు.
సర్వం శ్రీ సాయింధార్పణమస్తు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment