Wednesday, 4 January 2012

సాయి.బా.ని.స. డైరీ 1993 6వ. భాగము

సాయి.బా.ని.స. డైరీ 1993 6వ. భాగము 24.03.1993 బుధవారము "ఉగాది పర్వ దినము" నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి కలలో చూపిన దృశ్యాలు శ్రీ సాయి సత్చరిత్రలో జరిగిన సంఘటనలును పోలియున్నాయి. వాటి వివరాలు నేను విదేశాలకు వెళ్ళటానికి ఆఫీసు కారును కోరినాను. సాయంత్రము 7.30 నిమిషాలకు విమానము బయలుదేరుతుంది. మా ఆఫీసు కారు సాయంత్రము 7 గంటల వరకు రాలేదు. ఏమిచేయాలో తోచక రోడ్డుమీదకు వచ్చి కనిపించిన ప్రతివాడికి నమస్కారము పెడుతు వారి మోటారు సైకిల్స్ మీద ఆఖరికి హైదరాబాద్ కొత్త విమాన ఆశ్రయానికి చేరుకొంటాను. అక్కడి అధికారులు నా టికెట్టు చూసి మీరు ఎక్కవలసిన విమానము పాత బేగంపేట విమాన ఆశ్రయమునుండి రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది అన్నారు. అప్పటికి టైము సాయంత్రము 7.30 నిమిషాలు. అర్ధగంటలో పాత విమాన ఆశ్రయమునకు చేరుకోవాలి. రోడ్డుమీద వాహనాలు లేవు. ఏమితోచని పరిస్థితి. యింతలో రెండు గుఱ్ఱములను కట్టిన గుఱ్ఱము బండి వచ్చినది. నేను సంతోషముతో ఆ గుఱ్ఱము బండివానికి నమస్కరించి నన్ను పాత విమాన ఆశ్రయమునకు తీసుకొని వెళ్ళమని కోరినాను. ఆ బండివాడు నన్ను సంతోషముగా పాత విమాన ఆశ్రయయమునకు తీసుకొని వెళ్ళినాడు. విమానము ఎగరటానికి సిధ్ధముగా యున్నది. యింతలో నా పాలిట సాయి నా పినతండ్రి శ్రీ ఉపాధ్యాయుల సోమయాజులు గారుగా వచ్చి నీకు విమాన ప్రయాణములో ఆకలి వేస్తుంది, నీవు తినటానికి ఈ రొట్టెల మూట తెచ్చినాను తీసికో అన్నారు. యింతలో మెలుకువ వచ్చినది. ఈ విధమైన దృశ్యము ద్వారా శ్రీ సాయి ఆనాడు తన భక్తులను కాపాడిన వైనము భక్తులకు యిచ్చిన వాగ్దానములను నెరవేర్చిన వైనము జ్ఞాపకమునకు రాగానె శ్రీ సాయి సత్ చరిత్ర 33 వ. అధ్యాయములో శ్రీ సాయి జామ్నేర్ లో ఉన్న నానా సాహెబు చందోర్కర్ కుమార్తె ప్రాణాలు రక్షించటానికి జోడు గుఱ్ఱముల గుఱ్ఱము బండి (టాంగా) గాను, గుఱ్ఱము బండివాని గాను అవతారము ఎత్తిన సంఘటన మరియు 50 వ. అధ్యాయములో కాకా సాహెబు దీక్షిత్ తో "అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకపోయెదను" అన్న వాగ్దానము 05.07.1926 నాడు నెరవేర్చటము నిజము అని నమ్మినాను. 25.03.1993 గురువారము నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి రంజాన్ పండగ 25.03.1993 కు సందేశము యివ్వమని వేడుకొన్నాను. తెల్లవారుజామున కలలో "సబ్ గ్రంధోమే మై హూ" అనే పాట వినబడసాగినది. ఆపాట మా ఆఫీసులోని ఒక బహిరంగ సభలోని స్పీకరు నుండి వినిపించసాగినది. నేను ఆ సభలోనికి వెళ్ళినాను. అక్కడ వేదికపై వక్తలు తమ తమ మతాల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ప్రేక్షకులలో కొందరు వాటిని అంగీకరించటములేదు. యింతలో తెల్ల రంగు అంబాసిడర్ కారులో తెల్లని దుస్తులలో శ్రీ సాయి (ముఖ్యమంత్రి శ్రీ విజయభాస్కర్ రెడ్డి రూపములో ) సభలోనికి వచ్చి వేదిక మీదకు కోపముతో వెళ్ళి మైకులో గట్టిగా మాట్లాడుతూ "మతాలు విడివిడిగానే యుండాలి. ఆందులో తప్పులేదు. కాని అన్ని మతాల పవిత్ర గంధాలలోని సారాంశము ఒక్కటే - "సబ్ కా మాలిక్ ఏక్ హై" అంటు వేదిక దిగి జనంలో కలిసిపోయారు. 27.03.1993 శనివారము నిన్న రాత్రి కలలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో అన్నారు. "ఈరోజులలో అడవిలోనికి వెళ్ళి ప్రశాంతముగా తపస్సు చేసుకొందాము అంటే అక్కడి వాతావరణము సినిమావాళ్ళ సంస్కృతి తోను ముఠా తగవులతో కలుషితము అయిపోయినది. అందుచేత నా భక్తులు అందరు తమ తమ యిళ్ళలో దత్త దేవుని ధ్యాన మందిరాలు నిర్మించుకొని రోజు కొంతసేపు దత్తాత్రేయుని ధ్యానించాలి". శ్రీ సాయి సత్ చరిత్ర 36 వ. అధ్యాయములో యిద్దరు గోవా పెద్ద మనుషులు అన్న మాటలు " సాయియే మన దత్తుడు" అన్న మాటలు నిజము అని నమ్ముతున్నాను. సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment