Wednesday, 4 January 2012

సాయి.బా.ని.స. డైరీ 1993 11 వ. భాగము

సాయి.బా.ని.స. డైరీ 1993 11 వ. భాగము సాయి.బా.ని.స. డైరీ - 1993 03.07.1993 శనివారము - గురుపూర్ణిమ నిన్నటి రోజు ప్రశాంతముగా గడచినది. రాత్రి శ్రీ సాయికి నమస్కరించి, శ్రీ సాయినాధా ప్రతి గురుపూర్ణిమనాడు నీవు నా మనసుకు సంతోషము కలిగించుతున్నావు. తెల్లవారితే గురుపూర్ణిమ. నాలో నూతన ఉత్సాహాన్ని కలిగించు తండ్రి అని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో నాకు ప్రసాదించిన దృశ్యము మరచిపోలేనిది. 1974 వ సంవత్సరములో నా తండ్రి మరణించినారు. ఆనాటినుండి నా తల్లి నుదుట కుంకుమ బొట్టు కరువు అయినది. మరి కలలో " నా తల్లినుదుట పెద్ద కుంకుమ బొట్టు, జడనిండ పూలుతోను పట్టు చీర కట్టుకొని నా తండ్రిగారి ప్రక్కన నిలబడి నన్ను ఆశీర్వదించి ఒక మోటార్ సైకిల్ బహుమతిగా యిచ్చినది. శ్రీ సాయి నా తల్లి రూపములో గురుపూర్ణిమకు ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము చేయటానికి మోటార్ సైకిలు యిచ్చినారు అని భావించినాను. సాయంత్రము శ్రీ సాయినాధుని గుడికి వెళ్ళి శ్రీ సాయి యిచ్చిన సందేశాలు మొదటి భాగము (శిఖరాలు లోయలలో శ్రీ సాయి) శ్రీ సాయి పాదాలకు అంకితము చేసినాను. అక్కడినుండి నాటక రంగములో మంచి దర్శకుడు శ్రీ దీన్ బద్రు యింటికి వెళ్ళి శ్రీ సాయి పేరిట పట్టుకుండువా సమర్పించినాను. శ్రీ దీన్ బద్రుతో గడిపిన క్షణాలులో శ్రీ సాయితో మాట్లాడిన అనుభూతిని పొందినాను. ప్రతి గురుపూర్ణిమ శ్రీ సాయితో గడపాలి అనే కోరిక యెక్కువ కాసాగినది. భవిష్యత్ లోని గురుపూర్ణిమ అనుభూతుల కోసము వేచి చూడాలి. 25.07.1993 ఆదివారము నిన్న రాత్రి కలలో శ్రీ సాయి ఒక ఫకీరు రూపములో నాకు ఎదురు పడినారు. నేను వారికి ఎండు ఖర్జూరాలు తినటానికి యిచ్చినాను. ఆ ఫకీరు వాటిని ఆనప గింజలుగా మార్చి వేసి నాతో అన్నారు. "నీవు తినే ఖరీదు అయిన ఎండుఖర్జూరాల పోషక విలువను నేను ఈ ఆనప గింజలలో యిస్థాను. నమ్మకము ఉంటే స్వీకరించు" నేను సంతోషముగా ఆ ఆనపగింజలను స్వీకరించినాను. ఆయన నాతో మాట్లాడుతూ అన్నారు. నీలో యింకా మితృలు, శతృవులు అనే భావన పోలేదు ఆభావనకు దూరంగా ఉండు. సర్వకాల సర్వ అవస్థలయందు నన్నే స్మరించుతూ ఉండు" ఆనందముతో నిద్రనుండి మేల్కొనినాను ఈ చక్కటి దృశ్యము గురించి ఆలోచించుతూ ఉంటే శ్రీ సాయి సత్చరిత్రలోని 10 వ. అధ్యాయములో " బాబా ప్రతిజీవియందు దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే." మరియు వారు ఏనాడు తన భక్తులకు మంత్రోపదేశము చేయలేదు. "సాయి, సాయి" అను నామము జ్ఞప్తియందుంచుకొనుమనిరి. అట్లు చేసినచో మీ బంధములనుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందెదరని చెప్పిరి. ఈ మాటలు తిరుగు లేని నిజాలు అని సాయి.బా.ని.స. గా నమ్ముతాను. 28.07.1993 బుధవారము నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కారము చేసి ప్రశాంతముగా నిద్రపోయినాను. శ్రీ సాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో అన్నారు. "నీతోటివానికి ఆకలి వేసినపుడు నీవు వానికి యింత అన్నము పెట్టు. అది నాకే చెందుతుంది". సంతోషముతో నిద్రలేచినాను. ఈరోజు నా కుమార్తెకు శ్రీమంతము. పేరంటాళ్ళు వచ్చి నా కుమార్తెను ఆశీర్వదించి భోజనాలు చేసి వెళ్ళినారు. వారు అందరు వెళ్ళిన తర్వాత నేను నాదూరపు బంధువు (నా భార్య పెదతల్లి కుమారుడు) కలసి భోజనము చేసినాము. ఆ సమయములో శ్రీ సాయి నా ప్రక్కన కూర్చుని భోజనము చేస్తున్న అనుభూతిని పొందినాను. సాయంత్రము వాన చినుకులు పడసాగినవి. యింటికి వచ్చిన బంధువులు అందరు వెళ్ళిపోయినారు. నేను నా భార్య వీధి అరుగుమీద కూర్చుని యున్నాము. యింతలో ఒక పెద్ద కుక్క మా ముందు నిలబడి నోరు తెరచి నాలిక వెనక్కి ముందుకు ఆడించుచున్నది. నా భార్య నన్ను చూసి బాబా వచ్చినారు అంది. నేను సంతోషముగా నీకు బాబా వచ్చినారు అనే నమ్మకము ఉంటే ఆ కుక్క రూపములో ఉన్న బాబాకు భోజనము పెట్టమని చెప్పినాను. నా భార్య ఆకులో పిండివంటలు, పెరుగు అన్నము తెచ్చి ఆ కుక్కకు భోజనము పెట్టినది. నాలో సంతోషము కలిగినది. శ్రీ సాయి సత్ చరిత్ర 42 వ. అధ్యాయములో శ్రీ సాయి - శ్రీమతి లక్ష్మీబాయి షిండేతో అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చినవి. "ఆ కుక్క ఆకలి తీర్చుట నాయాకలి తీర్చుటవంటిది. కుక్కకు కూడ ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును. కాని అందరి ఆకలి యొకటియే. కొందరు మాట్లాడగలరు. కొందరు మూగవలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము". (యింకా ఉంది) సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment