Wednesday 4 January 2012

బానిస డైరీ 1993 -- 3 వ.భాగము

సాయి బానిస డైరీ 1993 -- 3 వ.భాగము 22.02.1993 ఈ రోజు రాత్రి 9 గంటలకు టీ.వీ. లో "ఫర్మాన్" ఉర్దూ సీరియల్ వచ్చినది. ఆ నాటకంలో యజమాని ముస్లిం నవాబు. అతని దగ్గర మేనేజరు హిందువు. ఆ నాటకము చూస్తూ ఉండగా శ్రీ సాయి నా మనసులో మెదలినారు. హిందూ ముస్లింల ఐకమత్యమునకు దోహదపడే మాటలు వినిపించచేయమని శ్రీ సాయిని ప్రార్థించినాను. సుమారు 20 నిమిషాల తర్వాత యజమానురాలు (ముస్లిం వనిత) తన హిందూ పనివాళ్ళతో అంటున్న మాటలు "శ్రీ రామ నవమినాడు గుడిలోని గంటల శబ్దము - మశీదులోని ప్రార్థనలు ఒకటిగా వినిపించితే ఎంత సంతోషముగా యుంటుంది" నన్ను ఆనంద పరవశములో ముంచెత్తినాయి. శ్రీ సాయి సత్ చరిత్ర 6 వ.అధ్యాయములో "బాబా శ్రీరామనవమి రోజున ముస్లింల చేత చందన ఉత్సవము జరిపించినారు." వారు హిందూ, మహమ్మదీయుల మైత్రికి ఈ విధముగా చేసియున్నారు అని నేను గట్టిగా నమ్ముతాను. 27.02.1993 శనివారము నిన్నరాత్రి నిద్రలో శ్రీ సాయి చక్కని దృశ్యాన్ని చూపించినారు. ద్వారకామాయిలోని స్థంభము చుట్టూ తూనీగలు చక్కగా ఎగురుతున్నాయి. వాటి కాళ్ళకు తేలికపాటి చొప్ప పుల్లలు కట్టబడియున్నాయి. అందువలన ఆ తూనీగలు అన్నీ ఒకే వరసలో ఒకే ఎత్తులో చక్కగా ఎగురుచున్నాయి. ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండగా ఒక అజ్ఞాత వ్యక్తి ఆ స్థంభము దగ్గర నిలబడి అన్నారు " మనసు ఇష్ఠము వచ్చినట్లు ఎగిరే తూనీగ, దానిని ఒక పధ్ధతిలో ఎగరనీయాలి అంటే గురువు మీద నమ్మకము అనే చొప్పపుల్ల దాని కాళ్ళకు కట్టాలి. అపుడు అది ఒక పధ్ధతిలో ఎగురుతూ మనిషికి మంచి నడవడిక ప్రసాదించుతుంది". ఈ దృశ్యాన్ని తలచుకొన్నపుడు శ్రీ సాయి ద్వారకామాయిలో నిలబడి తన భక్తుల మనసుకు నిలకడను ప్రసాదించుతున్నారని భావించినాను. 02.03.1993 మంగళవారము నిన్న రాత్రి నిద్రలో శ్రీ సాయి చక్కని దృశ్యము ప్రసాదించినారు. కమలానగర్ లోని (నా యింటిదగ్గర) చర్చిలోనికి వెళ్ళినాను. అక్కడ భక్తులు "ఏసునాధుని భజన చేయుదము రారండి" అని పాటపాడుతున్నారు. నేను మాత్రము మెల్లిగా "సాయినాధుని భజన చేయుదము రారండి" అని పాడుతున్నాను. భజన తర్వాత ఆ చర్చిలో గొప్ప, బీద, అనాధ పిల్లలు అందరు కలసి భోజనము చేస్తున్నారు. అందరి కంచాలలోను రొట్టి, వంకాయ కూర వడ్డించినారు. నా మనసులో శ్రీ సాయికి వంకాయ కూర చాల ఇష్ఠము కదా అనే భావన కలిగినది. నా ప్రక్కన ఓ అనాధ బాలిక కూర్చునియుంది. నేను వంకాయ కూరను రొట్టెముక్కలో పెట్టి ఆ చిన్న పిల్ల నోటికి అందించినాను. ఆ పిల్ల రొట్టె తింటు సాయినాధుని రూపములో దర్శనము యిచ్చినది. ఆ చర్చి ద్వారకామాయిగా మారిపోయినది. ఒక్కసారి ఆనందముతో నిద్ర లేచినాను. యిది అంతా కలకదా ఎంత మంచి కల అని భావించినాను. ఉదయము స్నానము చేసిన తర్వాత శ్రీ సాయి సత్ చరిత్ర నిత్యపారాయణ ప్రారంభించినాను. 9 వ. అధ్యాయము పారాయణ ప్రారంభించినాను. "బాబాకు వంకాయ పచ్చడి చాల రుచిగా ఉండెను. కాన దానినందరికి పంచిపెట్టెను. తనకు వంకాయ వేపుడు కూడ అప్పుడే కావలెననెను." ఈ మాటలు చదువుతుంటే నిన్న రాత్రి కలలో శ్రీ సాయి చర్చిలో (ద్వారకామాయి) వంకాయ కూర అందరికి పంచిపెట్టి తాను సర్వ దేవతా స్వరూపుడునని మరొక్కసారి ధృవపరచినారు. సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment