Wednesday, 4 January 2012
సాయిబానిస డైరీ - 1992
సాయిబానిస డైరీ - 1992
3 వ భాగము
19.06.1992
ఈ రోజు నిత్యపారాయణలో శ్రీ సాయిబాబా మహాసమాధి చెందటము అధ్యాయము చదివినాను. మనసు చాలా బాధతో నిండి ఉంది. ఏ నాడు యిటువంటి అనుభూతి కలుగలేదు. సాయంత్రము ఆఫీసునిండి యింటికి వచ్చినాను. యింటికి రాగానె పిడుగువంటివార్త విన్నాను -- నా ఉద్యోగ జీవితములో నాకు గురువు అయిన "శ్రీ మంధా సన్యాసిరాయ శర్మ" గారి భార్య శ్రీమతి అంబగారు పరమపదించినారు. ఈ వార్త నన్ను కలచి వేసినది. నేను ఆర్.ఏ.పి.పి. లో ఉద్యోగము చేస్తున్న రోజులలో ఆమె నన్ను తమ్ముడు అని పిలిచి భోజనము పెట్టిన యిల్లాలు. ఆమె మరణ వార్తను శ్రీ సాయి నాకు ఉదయము నిత్య పారాయణ సమయములో నాకు తెలియకుండానే అనుభవించేటట్లు చేసినారు.
21.06.1992
ఈ రోజు మధ్యాహ్న్నము సాయి బంధు శ్రీ సుందరరావుగారి యింటికి వెళ్ళినాను. ఆయన పూజమందిరములో శ్రీ షిరిడి సాయి, శ్రీ సత్యసాయిల ఫొటోలు ఉన్నవి. మధ్యాహ్న హారతి జరుగుతుండగా నామనసు లో శ్రీ సత్యసాయి పాదాలు పాదుకలు ఉన్న ఫొటో చాల బాగుంది కావాలి అని అనిపించినది.శ్రీ సుందరరావు గారు శ్రీ షిరిడీ సాయికి శ్రీ సత్యసాయికి హారతి యిచ్చిన తర్వాత తన పుస్తకాల పెట్టె చాల సేపు వెతకి శ్రీ షిరిడీ సాయి ఫొటోతో పాటు శ్రీ సత్యసాయి పాదాలు - పాదుకల ఫొటో నా చేతికి యిచ్చి వీటిని మీరు జాగ్రత్త పెట్టుకోండి అన్నారు. నా మనసులోని కోరికను శ్రీ షిరిడీ సాయి, శ్రీ సుందరరావుగార్కి తెలియపర్చి నా కోరిక తీర్చటము ఆలోచించితే ఆనాడు ద్వారకామాయిలో శ్రీ ధక్కర్, శ్రీ షిరిడీ సాయి సమక్షములో మనసులో "ద్రాక్ష పళ్ళు మొట్టమొదట కాకా కివ్వవలెను" తలచినంతనే శ్రీ షిరిడీసాయి ఆ కోరికను తీర్చినారు. యిది సాయి సత్ చరిత్ర 35 వ. అధ్యాయములో చెప్పబడినది.
23.06.1992
నిన్నటి రోజున మానసికముగాను, శారీరకముగాను చాల అలసిపోయిరాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. రాత్రి కలలో శ్రీ సాయి - నేను కొరియా దేశములో కలసిన బౌధ్ధ లామా రూపములో దర్శనము యిచ్చి, "ఆరోగ్యము కోసము మంచి మందులు వాడాలి" అన్నారు. నేను ఆయన పాదాలకు నమస్కారము చేసిన తర్వాత 1991 సంవత్సరము మే నెల పదవ తారీకున కొరియాలోని చాంగ్ వాన్ పట్టణములోని బౌధ్ధ భిక్షువు యిచ్చిన వెండి లాకెట్టును మెడలో ధరించినాను. రాత్రి కలను గురించి ఆలోచించుతుంటే 28 వ అధ్యాయములో శ్రీ సాయి లక్ష్మీ చందుతో "నీ వీపు నొప్పికి ఏదైన ఔషధము తీసుకొనుము" అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చినవి.
26.06.1992
నిన్న రాత్రి గౌతమి ఎక్స్ ప్రెస్ లో రాజమండ్రికి ప్రయాణము సాగించినాను. రాత్రి కలలో జీవితము ఒక రైలు ప్రయాణము అని చెప్పటానికి శ్రీ సాయి చూపిన దృశ్యము - నేను నా భార్య పిల్లలు రైలులో ప్రయాణము సాగించుతున్నాము. తినటానికి మూడు కిలోల మామిడి పళ్ళు కొన్నాను. కాని ఆ మామిడి పళ్ళలో ఆరు పళ్ళు నా చేతిలో కమిలి పోయినాయి. వాటిని తిరిగి దుకాణమువాడికి ఇవ్వాలి అని తలచినాను. రైలు ఒక స్టేషన్ లో ఆగి తిరిగి బయలుదేరినది. ఒక యుక్త వయస్సు కుఱ్ఱవాడు పరుగెత్తుతూ మా పెట్టి వైపు వస్తున్నాడు. నేను చేయి అందించి మా పెట్టెలోనికి ఆహ్వానించినాను. మేము దిగవలసిన స్టేషన్ వచ్చినది. కాని నేను నిద్ర పోతున్నాను. నా భార్యా పిల్లలు ఆ యువకుడు నన్ను లేపకుండ రైలు దిగి వెళ్ళిపోయినారు. రైలు తిరిగి బయలుదేరినది. నేను ఒక్కడినే సాయినామము జపించుతూ ప్రయాణము చేస్తున్నాను. శ్రీ సాయి ఈ విధముగా నా జీవిత ప్రయాణాన్ని త్రిగుణాలను అదిషడ్ వర్గాలను చూపించినారు. శ్రీ సాయి నా కళ్ళు తెరిపించి నాకు మేలు చేసినారు.
రాజమండ్రిలో నిత్యపారాయణ బొమ్మూరులోని వీర నాగ సాయి మందిరములో చేసినాను. ఈ రోజు 50 వ. అధ్యాయము పారాయణ చేసినాను. ఈ అధ్యాయములో రాజమండ్రిలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాములవారు (టెంబెస్వామి) మకాం చేసిన సంఘటన చదువుతుంటే - శ్రీ టెంబెస్వామి నా చేతికి ఒక టెంకాయను ఇచ్చి " దీనిని నాసోదరుడగు సాయికి నా ప్రణామములతో సమర్పింపుము" అంటున్న అనుభూతిని పొందినాను.
07.08.1992 శుక్రవారము : క్యాంప్ : బొంబాయి
నిన్న రాత్రి శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి చెప్పిన సూచనలు, సలహాలు.
1) గుండెపోటు నుండి రక్షణకోసము సార్బిట్రాన్ మాత్రలు దగ్గర ఉంచుకో.
2) ఈ సారి నీ తండ్రి ఆబ్ధికము గుడిలో చేయి. నీవు భోజనము చేసేటప్పటికి మధ్యాహ్న్నము మూడు గంటలు అగుతుంది. ముందుగా పిల్లలను భోజనము చేయమను.
3. నీకు స్నేహితులు ఉన్నారంటే వాళ్ళు రవి, మరి అతని భార్య పుట్టి వాళ్ళతో కష్ఠ సుఖాలు పంచుకో.
4. నీవు నీ భార్య పిల్లల మీద ఉన్న మమకారము తగ్గించు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment