Wednesday, 4 January 2012
సాయి.బా.ని.స. డైరీ 1993 13 వ భాగము
సాయి.బా.ని.స. డైరీ 1993 13 వ భాగము
సాయి. బా. ని. స. డైరీ - 1993
19.08.1993 గురువారము
శ్రీ సాయి నిన్న రాత్రి విచిత్రమైన దృశ్యాన్ని చూపించినారు. నేను తెల్లని బట్టలు ధరించి రాత్రి వేళ తిరుమల కొండమీద గుడిలోనికి వెళుతున్నాను. గుడిబయట బ్రహ్మోత్సవాలు పేరిట చాల కరెంటు దీపాలు వెలిగించినారు. గుడి బయట చాల కాంతివంతముగా ఉంది.
కాని గుడిలోపల దీపాలు లేవు. చాలా చీకటిగాయుంది. నేను చీకటిలో తడుముకొంటు గోతులలో పడుతు లేస్తు గర్భగుడిలోనికి వెళతాను. నేను పడుతున్న పాట్లు చూసి నాతోటె యాత్రికుడు (శ్రీ సాయి) అంటారు - "చీకటి లో భగవంతుని వెతకటానికి చాలా ప్రయాస పడాలి. సమర్థ సద్గురువు అనే టార్చి లైటును నీతోడు ఉంచుకో. భగవంతుని కన్నులార చూసుకో" ఆనందముతో నిద్రలేచి శ్రీ సాయికి నమస్కరించి సర్వకాల సర్వ అవస్థలయందు నాకు తోడుగా యుండమని వేడుకొన్నాను.
20.08.1993 శుక్రవారము
నిన్నటిరోజున ఆఫీసులో చాలా చికాకులు కలిగినాయి. రాత్రి శ్రీ సాయి యిచ్చిన సూచనలు 1) నీ మనసు చికాకుతో ఉన్నపుడు పాన్ దుకాణమునకు వెళ్ళి మీఠా పాన్ తయారు చేయించుకొని తిను. ఈ సూచన నన్ను శ్రీ సాయి సత్ చరిత్ర 18, 19 అధ్యాయములో శ్రీ హేమాద్రిపంతు మనసులో చెడు ఆలోచనలు, చికాకులు ఉన్నపుడు శ్రీ సాయి వారిని శ్యామా యింటికి పంపి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మనమని చెప్పటము - శ్యామా శ్రీ హేమాద్రిపంతుకు చక్కటి తాంబూలము యిచ్చి మంచి విషయాలు తెలియపర్చి చికాకులు తొలగించటము గుర్తు చేసినది. 2) వీలు అయినంతవరకు నీకు యిష్ఠములేని వారి ముఖము, దుష్ఠుల ముఖము చూడరాదు. 3) చికాకు ఉన్నపుడు ఒంటరిగా కూర్చొనరాదు. పదిమందిలో కలిసి సత్ సంగం (మంచి విషయాలు)మాట్లాడుకొంటూ యుండాలి. లేదా ఏదైనా చేతిపని కల్పించుకొని ఆ పని చేస్తూ ఉండాలి.
21.08.1993 శనివారము
ఆధ్యాత్మిక విషయాలు తెలియచేయమని శ్రీ సాయిని వేడుకొని నిద్ర పోయినాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు చాలా ఆసక్తిని కలిగించినాయి. ఒక అజ్ఞాత వ్యక్తి (శ్రీ సాయి) తన చేతిలోని రిమోట్ కంట్రోల్ స్విచ్చిని నొక్కుతూ ఉంటారు. ఆ సమయములో దేవాలయము, మశీదు, చర్చిలలో లేట్లు వెలుగుతాయి. రాత్రి అంతా నేను ఆ దేవాలయము, మసీదు, చర్చి లను దీపపు కాతిలో చూసి తెల్లవారేసరికి ఓనది ఒడ్డుకు చేరినాను. ఆనదిలో ఆనందముతో ఈత కొడుతూ ముందుకు సాగిపోతూ ఆఖరికి సముద్రములోనికి చేరినాను. ఆ సముద్రములో కెరటాలు లేవు. చాలా ప్రశాంతముగా యున్నది. నేను ఈత కోట్టకపోయిన ప్రశాంతముగా నీటిపై తేలుతున్నాను.
ఆనందముతో ఉక్కిరి బిక్కిరి అయి నిద్రనుండి మేల్కొన్నాను. ఎదురుగా ఉన్న శ్రీ సాయి పటానికి నమస్కరించుతుంటే శ్రీ సాయిఈ విధమైన సందేశము యిచ్చిన అనుభూతిని పొందినాను. "అన్ని మతాలు నదులువంటివి. నీవు ఏ నదిలోనైన ఈత కొడుతు ఆఖరికి సముద్రములోనికి (పరమాత్ముడు)చేరవలసినదే అనేది గుర్తు ఉంచుకో " శ్రీ సాయి అనే సందేశాన్ని గ్రహించగలిగినాను.
22.08.1993 ఆదివారము
నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి అనారోగ్యము బాధలనుండి తప్పించుకొనే మార్గము తెలుపమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో అంటారు. మనిషి ఆరోగ్యముగా ఉండాలంటే మనసులోని చీకాకులును తొలగించుకొని జీవించాలి. చీకాకులు తొలగించుకోవాలి అంటే ఎవరి కర్మకు వారే బాధ్యులు అనే సిధ్ధాంతము మీద బ్రతకాలి. అపుడు అనారోగ్యము నీ దరి దాపులకు రాదు.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment