Saturday, 21 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (10)




సాయి.బా.ని.. డైరీ - 1994  (10)

నిన్న రాత్రి కొందరు మితృలను భోజనానికి పిలిచినాను.  భోజన సమయములో మా ఆఫీసులో పని చేసి  రిటైరు అయిన ఉన్నత ఉద్యోగిని దూషించినాను.  మితృలుకూడా నాతో కలసి ఉన్నత ఉద్యోగిని దూషించినారు.   



రాత్రి భోజనాలు అనంతరము మితృలు అందరు వెళ్ళిపోయినారు.  నేను ప్రశాంతముగా నిద్రపోయినాను.  ఉదయము ఆరు గంటలకు లేచి మార్నింగ్ వాక్ కోసము బయలు దేరినాను.  నేను మార్నింగ్ వాక్ నుండి తిరిగి వస్తూ ఉంటే చాలా కాలమునుండి కనిపించని మితృడు కనిపించినాడు.  అతను నాతో అన్నమాటలు "నిన్నరాత్రి పది గంటలకు నీ గురించి మరియు మన ఆఫీసునుండి  రిటైరు అయిన ఉన్నత ఉద్యోగి (డా. ఎన్.కే. రావు) గురించి ఆలోచించసాగినాను.  యిపుడు నీకు మరియు డా. ఎన్.కే. రావు గార్కి మంచి సంబంధాలు ఉన్నాయా లేదా?"  మాటలు వింటూ ఉంటే శ్రీ సాయి  స్వయముగా మాట్లాడుతున్నారా అనిపించినది.  శ్రీ సాయి సత్ చరిత్ర 21 . అధ్యాయములో  పండరీపురము ప్లీడరు విషయములో శ్రీ సాయి అన్న మాటలు "ఒకరిని గూర్చి చెడ్డ చెప్పరాదు, మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు" మరియు బాబా సర్వాంతర్యామి తన భక్తులు ఎక్కడ ఏమి చేస్తున్నా - ఏమి మాట్లాడిన వారికి అన్ని తెలియును అనేది గుర్తు చేసుకొన్నాను.   

10.03.1994

నిన్నటిరోజు "శివరాత్రి".  రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను.  రాత్రి కలలో శ్రీ సాయి చూపించిన దృశ్యము నాలో చాలా ఆలోచనలను రేకిత్తించినవి.  వాటి వివరాలు:

నేను తెల్లని అండర్ వేరు, బనీను ధరించి చేతిలో పుస్తకము పెన్ను పట్టుకొని రోడ్డుమీదకు వచ్చినాను.  రోడ్డుమీద "ఆత్మకూర్" కు మార్గము అని వ్రాసి యుంది.  నేను ఆత్మకూర్ గురించి ఆలోచించుతూ నడక ప్రారంభించినాను.  యింతలో వెనుకనుండి బస్సు నాప్రక్కనుండి చాలా వేగముగా వెళ్ళిపోయినది.  సమయములో నా చేతిలోని పెన్ను, పుస్తకము రోడ్డుమీద పడిపోయినవి.  బస్సు చక్రాలు పెన్ను మీదగా వెళ్ళినది.  పెన్ను విరిగిపోయినది.  పుస్తకములోని కాగితాలు గాలికి రెపరెపలాడుతున్నాయి.  నేను పుస్తకాన్ని ఆరోడ్డుమీదనే వదలి వేసి ఆత్మకూర్ ఎక్కడవున్నది అని ఆలోచుంచుతూ రోడ్డుమీద ప్రయాణము సాగించసాగినాను.   

12.03.1994

నిన్నటిరోజు రంజాన్ నెలలోని శుక్రవారము.   రంజాన్ మాసము సందర్భముగా హిందువులకు, ముస్లింలకు సందేశము యివ్వమని శ్రీ సాయిని కోరినాను.  శ్రీ సాయి రాత్రి కలలో ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నారు.  "నీవు నీ బ్రతుకు తెరువు కోసము అన్ని విధములైన సర్దుబాట్లు చేసుకొంటూ నీకు నచ్చని నీ ఉన్నత ఉద్యోగి దగ్గర పని చేయటము లేదా - మరి యింట అత్తకోడళ్ళు గొడవలు పడుతున్న సంసారాలు చేయటము లేదా - అలాగే అన్ని మతాలువారు దేశములో సర్దుబాట్లు చేసుకొంటు ప్రశాంతముగా జీవించాలి."

15.03.1994

నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ఆధ్యాత్మిక శక్తి గురించి వివరించమన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు "గతంలో నీవు అనుభవించిన కష్ఠాలను మరచి పోవటము గొప్ప ఆధ్యాత్మిక శక్తి."

20.03.1994

నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సాయినాధ - మాట్లాడు తండ్రీ అని వేడుకొన్నాను.  శ్రీ సాయి నా జీవితము మరియు నా బంధువుల జీవితాలలోని ముఖ్య విషయాలను దృశ్యరూపములో చూపించినారు.  వాటి సారాంశము. "మనము పిల్లలకు జన్మ యిస్థాము. అంతే గాని వాళ్ళ అదృష్ఠాలకు ఎంత వరకు మనము బాధ్యులము"  అనే ప్రశ్నతో వారిని  వదలివేస్థాము.  కాని సమర్ధ సద్గురువు తన భక్తుల సంతోషము కోసము వారి ప్రశాంత జీవితము కోసము తన భక్తుల పిల్లల అదృష్టాన్ని బాగుచేస్తారు".   

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment