Wednesday, 4 January 2012

సాయి.బా.ని.స. డైరీ 1993 12 వ భాగము

సాయి.బా.ని.స. డైరీ 1993 12 వ భాగము సాయి.బా.ని.స. డైరీ - 1993 13.08.1993 శుక్రవారము రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి బాబా నా ఆఖరి శ్వాస నీ పాదాల మీద తీసుకొంటావా లేదా? మరియు నా ఆఖరి శ్వాసకు ముందు, నేను, నాభార్యపిల్లల ఋణము తీర్చుకొంటానా లేదా అని ప్రశ్నించినాను. శ్రీ సాయి దృశ్య రూపములో యిచ్చిన సమాధానాలు నన్ను సంతోష పరిచినాయి. శ్రీ సాయి తమిళనాడు గవర్నరు శ్రీ చెన్నారెడ్డి రూపములో దర్శనము యిచ్చినారు. ఆయన ముందు చాలా మంది ప్రముఖులు ఉన్నారు. నేను ఆయన దర్శనమునకు వెళ్ళినాను . శ్రీ చెన్నారెడ్డి అంతమంది ప్రముఖులలో నన్ను నా పేరుతో పిలిచి ఏమికావాలి అనడిగినారు. నేను వారి పాద పూజ చేసుకోవాలి అనే కోరికతో వచ్చినాను అని చెప్పినాను. ఆయన చిరునవ్వుతో నన్ను దగ్గరకు చేరతీసి నా శిరస్సుపై చేయి వేసి నా శిరస్సును ఆయన పాదాలపై ఉంచుకొన్నారు. అప్పుడు నేను ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉన్నాను. వెంటనే తెలివి వచ్చినది. నిద్ర లేచి శ్రీ సాయికి నమస్కరించి సంతోషముగా నిద్రపోయినాను. తిరిగి కలలో శ్రీ సాయి మెహదీపట్నములో నేను నెల నెల సరుకులు కొనే కిరాణా దుకాణము యజమాని (కిరాణా దుకాణము యజమాని ముస్లిం) రూపములో దర్శనము యిచ్చి నన్ను పిలిచి మీరు యిచ్చిన డబ్బుతో మీ భార్యా, పిల్లలకు జీవితాంతము తినటానికి కావలసిన సరుకులు మీ యింటికి పంపినాను అన్నారు. నాకు తెలివి వచ్చినది. సంతోషముగా శ్రీ సాయికి నమస్కరించినాను. నేను కోరుకొన్న రెండు కోరికలు శ్రీ సాయి నెరవేర్చుతారు అని నమ్మకము కుదిరినది. 15.08.1993 ఆదివారము నిన్నటి రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి భవిష్యత్ లో నీ సేవ చేసుకొంటు పదిమంది సాయి బంధువుల వెనుక నేను తిరుగుతు వారికి శ్రీ సాయి తత్వము తెలియచేయాలా లేక పదిమంది సాయి బంధువులు నా దగ్గరికి వచ్చినపుడు వారికి శ్రీ సాయి తత్వము తెలియచేసుకుంటు నీ సేవ చేసుకొంటున్న తృప్తిని పొందాలా దయచేసి తెలియ చేయమని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్య రూపములో యిచ్చిన సూచనలు. 1) నేను కుటుంబ సమేతముగా తిరుమల తిరుపతి యాత్రకు వెళతాను. అక్కడ నా కుటుంబ సభ్యులు అందరు ను చెప్పిన రీతిగా శ్రీ వెంకటేశ్వరుని (శ్రీ సాయిని) పూజించుతారు. 2) అన్ని రాష్ట్రములనుండి లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు నాయింటికి నన్ను కలుసుకొనేందుకు వస్తారు. వారి అందరితోను నేను శ్రీ సాయి గురించి మాట్లాడుతాను. 3) శ్రీ సాయి నా స్నేహితుడు టీ.వీ.జీ. రూపములో దర్శనము యిచ్చి తన కుమార్తె పెండ్లి పిలుపులకోసము హిందూ ముస్లిం స్నేహితులను తీసుకొని నా యింటికి వస్తారు. ఆ సమయములో నా యింట కొందరు నెత్తిమీద రుమాళ్ళు కట్టుకొని నమాజు చేస్తారు. మరికొందరు పూలతో శ్రీ సాయికి పూజ చేస్తారు. శ్రీ సాయి ఆదేశానుసారము నేను యింటివద్ద (నంబరు 7-204) యుంటు శ్రీ సాయి సేవ చేసుకోవాలి అని నిశ్చయిం చుకొన్నాను. 17.08.1993 మంగళవారము నిన్న రాత్రి నిద్రలో శ్రీ సాయి నాకు యిచ్చిన సూచనలు 1) నీ ఆఖరి శ్వాస వరకు తెల్లని వస్త్రాలు ధరించు 2) శ్రీ సాయి కాలేజీలో చేరి సాయి తత్వము తెలుసుకో 3) తక్కువ సామానులు (ఆస్థిపాస్తులు) తో జీవనము గడుపు 4) భార్య వ్యామోహము కొంత వరకు తగ్గించి బ్రహ్మచర్యమును పాటించు 5) మాంసాహారము, త్రాగుడు నిషేధించు 6) నీ భోజనానికి డబ్బు ఎవరినీ అడగవద్దు. నీ భోజనానికి కావలసిన ధనము నేనే ఇస్తాను. -- శ్రీ సాయి. 18.08.1993 బుధవారము రాత్రి నిద్రలో శ్రీ సాయి యిచ్చిన సందేశము, సూచనలు 1) అన్ని మతాలలోని సారాంశము ఒక్కటే. భగవంతుని పూజించేముందు నీతోటివానిని గౌరవించు. అందరిలోను భగవంతుని చూడు. 2) భవిష్యత్ లో బియ్యము ధర విపరీతముగా పెరిగి పోతుంది. న్యాయము కోసము కోర్టులకు పరిగెడుతారు ప్రజలు. 3) భవిష్యత్ లో విద్యాలయాలలో నైతిక విలువలు పడిపోతాయి. గురు శిష్యుల అనుబంధమునకు వక్ర భాష్యము చెబుతారు ప్రజలు. (ఇంకా ఉంది) సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment