Wednesday 4 January 2012

సాయి.బా.ని.స. డైరీ 1993 8 వ. భాగము

సాయి.బా.ని.స. డైరీ 1993 8 వ. భాగము 22.04.1993 గురువారము నిన్నటి రోజున ధ్యానములో శ్రీ సాయిని సలహా యివ్వమని నా సమస్యలు వారి ముందు విన్నవించుకొన్నాను. నా ఆఫీసు వ్యవహారాలలో ఓ మితృడి సహాయము - అధ్యాత్మిక రంగములో (శ్రీ సాయి ప్రసాదించిన సందేశాలను ఏరి కూర్చటానికి) ఓ సాయి బంధువు సహాయము కోరవచ్చునా లేదా తెలియ చేయమని శ్రీ సాయిని ప్రార్ధించినాను. శ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన సలహా " ఎన్నికల హడావిడిలో మానవమాత్రుడు శ్రీ ఎన్.టీ.రామారావు ఎవరిమీద ఆధార పడకుండ తన స్వశక్తిమీద నమ్మకము ఉంచి తన పార్టీలోని యితర నాయకులకు సహాయము చేస్తున్నాడే మరి భగవంతుడు ఎవరి మీద ఆధార పడటములేదు. నీలో భగవంతుడు యున్నాడు. మరి అటువంటి సమయములో నీవు నీ స్వశక్తిమీద ఎందుకు ఆధారపడలేవు - ఆలోచిందు" అన్నారు. ఈ విధమైన సందేశముతో శ్రీ సాయి నాకళ్ళు తెరిపించి - ప్రాపంచికరంగములోను, ఆధ్యాత్మిక రంగములోను నీవు కోరుకొన్న నీ ఆశయాన్ని సాధించాలి అంటే నీ స్వశక్తిమీద ఆధార పడి భగవంతుని అనుగ్రహము పొంది మన ఆశయాన్ని సిధ్ధింపచేసుకోవాలి అని గ్రహించగలిగినాను. 24.04.1993 శనివారము ఈ రోజు నా పుట్టినరోజు. నిన్న రాత్రి శ్రీ సాయి ఆదేశించిన విధముగా శ్రీ మహావిష్ణువు గుడికి వెళ్ళాలి అనే ఆలోచనలతో, శ్రీ వినాయకునికి నమస్కరించి, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీ పాండురంగని గుడికి చేరుకొన్నాను. గుడిలోనికి వెళ్ళి పూజారి చేతికి పూలు, పళ్ళు యిచ్చినాను. ఆ పూజారి అర్చన చేసి నేను సమర్పించిన అరటి పళ్ళను స్వామికి నైవేద్యముగా పెట్టి బయటకు వచ్చి తీర్థ ప్రసాదాలు నాకు యిచ్చినారు. నేను ప్రశాంత మనసుతో పాండురంగని విగ్రహము చూస్తూ నిలబడిపోయినాను. నా మనసులో శ్రీ సాయి సత్ చరిత్ర నాలుగవ అధ్యాయములో శ్రీ గౌలిబువా అన్న మాటలు "సాయిబాబా పండరీనాధుని అవతారము" చెవిలో వినిపించసాగినవి. శ్రీ గౌలిబువా అన్న మాటలు నిజము అయితే శ్రీసాయి, పాండురంగని విగ్రహము దగ్గర ఏదైనా నిదర్శనము చూపాలి అని మనసార కోరుకొన్నాను. నేను నా కళ్ళను నమ్మలేకపోయినాను. పాండురంగని పాదాల దగ్గర నేను సమర్పించిన అరటిపళ్ళు తినటానికి ఓ చిట్టెలుక వచ్చి ఆ అరటిపళ్ళను తినసాగినది. నా మనసులో శ్రీ సాయి సత్ చరిత్ర 42 వ. అధ్యాయములో "బాబా సర్వ జీవవ్యాపి" అని చెప్పబడిన మాట నిజముగా కళ్ళముందు చూసినాను అనే భావన పొందినాను. 10.05.1993 సోమవారము ఈ రోజు నా కుమార్తె వివాహము జరిగిన రోజు. 10.05.1992 నాడు నా కుమార్తె వివాహము జరిగినది. ఆ రోజున నిత్య పారాయణగా శ్రీ సాయి సత్ చరిత్రలో 32 వ. అధ్యాయము పెండ్లి హడావిడిలో చదవలేక పోయినాను. మనసులో అది ఒక బాధగా మిగిలిపోయినది. శ్రీ సాయి నా బాధను గుర్తించి ఈ రోజున అంటే 10.05.1993 సోమవారమునాడు నిత్యపారాయణగా 32 వ. అధ్యాయము చదివే భాగ్యము కలిగించినారు. అది నా అదృష్ఠముగా భావించినాను. 16.05.1993 ఆదివారము నిన్న రాత్రి శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో అన్నారు. "జీవితములో నీ కష్ఠ సుఖాలు చెప్పుకోవటానికి కనీసము ఒకరిద్దరు స్నేహితులను ఉంచుకో - వాళ్ళను నమ్ముకొని వారికి నీ కష్ఠసుఖాలు చెప్పుకో" ఈ విధమైన కల రావటము ఆశ్చర్యపడినాను. నాకు జీవతములో ఉన్న చిన్ననాటి నా ప్రాణ స్నేహితుడు హెచ్.రవీద్రనాధ్ యిపుడు ఫతేగడ్ లో ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా ఉన్నాడు, అతని గురించి ఆలోచించుతూ ఓ ఐదునిమిషాలు ఉదయము గడిపినాను. మధ్యాహ్న్నము మూడు గంటలకు కాలింగ్ బెల్ మ్రోగినది తలుపుతీసినాను. నాకళ్ళను నేను నమ్మలేకపోయినాను. నా చిన్ననాటి ప్రాణస్నేహితుడు రవీంద్రనాధ్ ఆరోజు ఫతేగడ్ నుండి హైదరాబాద్ కు వచ్చి నన్ను చూడటానికి తన భార్యాసమేతముగా నాయింటికి వచ్చినాడు. నిన్న రాత్రి కలలో శ్రీ సాయి అన్న మాటలకు నిదర్శనముగా నా ప్రాణస్నేహితుడు నన్ను చూడటానికి రావటము - శ్రీ సాయిలీలగా భావించినాను. (యింకా ఉంది) సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment