Wednesday 11 January 2012

సాయి.బా.ని.స. డైరీ 1994 (6)





12.01.2012  గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని..  డైరీ  1994  (6)

17.02.1994

నిన్నటి రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "ఆధ్యాత్మిక రంగములో అభివృధ్ధికి సూచనలు"  యివ్వమని వేడుకొన్నాను.  శ్రీ సాయి అజ్ఞాతవ్యక్తి రూపములో కలలో దర్శనము యిచ్చి అన్నారు.



1) మనిషి జీవితములో సంతోషము కలిగించే వివాహాది శుభకార్యాలు, విచారము కలిగించే మరణమును సమదృష్ఠితో చూడగలగటము.

2) వృధ్దాప్యములో ధన, ధార, సంతానములపై వ్యామోహము విడనాడి, ఏకాంత జీవితము గడుపుతూ పరమాత్మ పిలుపుకోసము ఎదురు చూడగలగటము, నిజమైన ఆధ్యాత్మిక శక్తికి ఉదాహరణలు.

18.02.1994

నిన్నటి రోజు గురువారము శ్రీ సాయినామము స్మరించుతూ రాత్రి నిద్రకు ముందు భగవంతుని శక్తి గురించి చెప్పమని శ్రీ సాయినాధుని వేడుకొన్నాను.  శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు.  "కాల చక్రములో దేవుని పేరిట వెలిసిన గుళ్ళు గోపురాలు వాటి వాటి అదృష్ఠానుసారము వైభవమును అనుభవించి కాల గర్భములో కలసిపోతాయి.  కాల చక్రానికి అతీతమైన భగవంతుని శక్తికి నాశనము లేదు.  అందుచేత గుళ్ళుగోపురాలను నమ్ముకొనేకంటే నాశనము లేని భగవంతుని శక్తినే నమ్ముకో".

19.02.1994

నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "జీవితానికి పనికి వచ్చే మంచి సలహాలను చెప్పుతండ్రీ" అని వేడుకొన్నాను.  (1) శ్రీ సాయి ట్రాఫిక్ పోలీసు రూపములో దర్శనము యిచ్చి అంటారు "జీవితములో నాలుగు రోడ్ల జంక్షన్ వచ్చినపుడు - రోడ్డుమీదగా ప్రయాణము చేయాలి అనే సందిగ్ధ అవస్థ కలిగినపుడు శ్రీ సాయి అనే ట్రాఫిక్ పోలీసు సలహా పాటించి ముందుకు పయనించు.   

2) ఆధ్యాత్మిక రంగములో అడుగు పెట్టినవాడు సన్యాసము తీసుకోవాలని చాలా ఉత్సాహ పడతాడు, తీరా సన్యాసము తీసుకొన్న తర్వాత భోజనము కోసము తన యింటిముందే నిలబడవలసి యుంటుంది.  అందుచేత సన్యాసము తీసుకోకుండ గృహస్థ ఆశ్రమములోనే యుంటు ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము చేయటము ఉత్తమము. 

20.02.1994

నిన్నటిరోజు ప్రశాంతముగా గడచినది.  రాత్రి కలలో శ్రీ సాయి యిచ్చిన సందేశము "నీ యింట జామి చెట్టు కాయలను ప్రక్కయింటి పిల్లలు కోస్తున్నారని వాళ్ళను దండించటానికి సిధ్ధపడుతున్నావే మరి నీవు చేస్తున్న పని ఏమిటి?  దొంగ లెక్కలు వ్రాసి యితరుల సొమ్ము దొంగిలించుతున్నావే - యిది ఎక్కడి న్యాయం !   


24.02.1994

నిన్న రాత్రి కలలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నమాటలు.

1) జాతకాలు చూసుకొని వివాహము చేసుకొని 25 సంవత్సరాలు కాపురము చేసి, మాట పట్టింపులకు విడాకులు తీసుకొన్న దంపతుల పిల్లలు కొందరు ప్రేమ వివాహాలు చేసుకొని మూడునాళ్ళు తిరగకుండా వారు విడాకులు తీసుకొంటే అటువంటివారి జీవితాలను ఏమనాలి.  అటువంటి పరిస్థితికి కారణాలు ఏమిటి ఒక్కసారి ఆలోచించు.  నీ ఆలోచనలలో గురువు (భగవంతుడు) అనుగ్రహము లేకపోవటము వలన యిటువంటి పరిస్థితులు కలుగుతాయి అనే భావన కలిగితే చాలు.  ఆభావనే నిన్ను ఆధ్యాత్మిక రంగములో నడిపించుతుంది
 (యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment