Wednesday, 4 January 2012
సాయి.బా.ని.స. డైరీ 1993 14వ భాగము
సాయి.బా.ని.స. డైరీ 1993 14వ భాగము
సాయి.బా.ని.స. డైరీ - 1993
02.09.1993
నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయిని గురించి ఆలోచించుతూ నిద్రపోయినాను. కలలో ఒక అజ్ఞాత వ్యక్తిని కలుస్తాను. ఆయనను చూస్తే శ్రీ సాయిలాగ ఉన్నారు. ఆయనను చూడగనే మీరు ఎవరు? అని ప్రశ్నించినాను. ఆయన యిచ్చిన సమాధానము నన్ను చాలా ఆశ్చర్య పరిచినది. ఆయన యిచ్చిన సమాధానము "కష్ఠాలు అనే దొంగలు నీలోని ధైర్యాన్ని దొంగిలించకుండ నిన్ను కాపాడుతూ యిండే శక్తిని నేనే - అదే శ్రీ సాయి శక్తి".
పీ.ఎస్. 21.04.1996
ఈ రోజున గుండె పోటుతో సికంద్రాబాద్ లోని సీ.డీ.ఆర్. ఆసుపత్రికి వెళ్ళినపుడు ఆ ఆసుపత్రి ముందు ఉన్న మందుల దుకాణము బోర్డ్ చూసి ఆశ్చర్య పడినాను. ఆ బోర్డు మీద ఉన్న అక్షరాలు "శ్రీ సాయి శక్తి మెడికల్ హాల్" నాకు ధైర్యాన్ని ప్రసాదించినది.
04.09.1993
నిన్నరాత్రి శ్రీ సాయి యిచ్చిన సందేశాలు.
1) భగవంతుని పూజ చేసుకోవటానికి కావలసిన సామానులు నీకు నమ్మకము ఉన్న వ్యక్తికి పురమాయించి ముహూర్తము వేళకు ఆ వ్యక్తి రాలేదు అని ఆందోళన చెందటము దేనికి? ఆత్మ శుధ్ధితో ఆ ముహూర్తము సమయానికి భగవంతుని పూజ ఉన్నదాంతో చేయటము మంచిది కదా. నమ్మకము అనేది భగవంతునిపై యుండాలి. అంతే కాని మనిషిపై కాదు. 2) మానవుడి జీవితము ఓ భయంకరమైన విష నాగు పాము. నాదగ్గరకు చేరాలంటే పాపాలు అనే కుబుసము (చర్మము) వదలి అహంకారము అనే కోరలు తీసి వేయబడిన తర్వాతనే ఆ జీవితము నాలో కలసిపోతుంది. -- శ్రీ సాయి.
08.09.1993
శ్రీ సాయి నిన్న రాత్రి విచిత్రమైన దృశ్యాన్ని చూపించినారు. సందేశాన్ని ప్రసాదించినారు. అది శివరాత్రి పర్వదినము. శివుని ఆలయములో విపరీతముగా భక్తులు యున్నారు. నేను శివుని ఆలయములోనికి వెళ్ళలేక పోతున్నాను.
భగవంతుని పూజ చేసుకోలేకపోతున్నా అనే బాధ నా మనసులో మెదిలింది. శివుని ఆలయము దగ్గరలో శ్రీ విష్ణువు ఆలయము ఉంది. గుడి తలుపులు తెరచి యున్నాయి. కాని పూజారి మాత్రము ఆలయ ప్రాంగణములో ఉన్న పెద్ద మేడ మీద ఆఖరి అంతస్థులో నిద్రపోతున్నాడు. నాకు పూజ చేసుకోవాలనె తపన. ధైర్యము చేసి ఆ పూజారిని నిద్రలేపినాను. ఆపూజారి డబ్బుకోసము నాచేత మొక్కుబడి పూజ కావించినాడు. నా మనసుకు తృప్తి కలగలేదు. అతనికి దక్షిణ యిచ్చినాను. అతను ఆ చిన్న మొత్తానికి సంతోష పడలేదు. అతను అడిగిన ధనము నేను యివ్వలేకపోయినాను. అతను నా బట్టలు ఊడదీసి నన్ను అవమాన పరచి బయటకు పంపివేసినాడు. నేను నగ్నముగా రోడ్డుమీదకు వచ్చినాను. ఒక అజ్ఞాత వ్యక్తి (శ్రీ సాయి) వచ్చి నాకు తెల్లని వస్త్రము యిచ్చినారు. ఆ వస్త్రమును మొలకు చుట్టుకొని నిలబడినాను. ఆ వ్యక్తి అన్నారు "గుళ్ళు గోపురాలు చుట్టు తిరిగి సమయము (కాలము) ధనము యిందుకు పాడుచేసుకొంటావు. నీకు ఉన్న సమయము ధనముతో నీ యింటనే భగవంతుని పూజ చేసుకో. భగవంతుడు గుడిలోనే కాదు. నీ యింట ఉన్నాడు అని తెలుసుకో".
10.09.1993
వృధ్ధాప్యములో ఆరోగ్యముగా జీవించటానికి పాటించవలసిన సూత్రాలను తెలియచేయమని శ్రీ సాయిని ప్రార్థించినాను. శ్రీ సాయి స్వప్నములో యిచ్చిన సూచనలు.
1) నిన్ను తప్పించుకొని తిరిగే వారి దగ్గరకు వెళ్ళి నీవు మాట్లాడినా మాట్లాడకపోయినా ఒకటే. అనవసరముగా మనసు కష్ఠపెట్టుకొని ఆరోగ్యము పాడుచేసుకోవద్దు. 2) పిలవనిదే ఎవరి యింటికి భోజనానీకి వెళ్ళవద్దు. అటువంటివారి యింట భోజనము చేసి శారీరకముగాను, మానసికముగాను అనారోగ్యము కొని తెచ్చుకోవద్దు. 3) శారీరకముగా పతనము (వ్యభిచారము) చెందిన స్త్రీ చేతి వంట తినరాదు.
12.09.1993
నేటి సమాజములో ఉన్నత పదవులలో ఉన్న వ్యక్తులు చెడు పనులు చేస్తున్నారు. ఆ పనులు సమాజముపై చెడు వాతావరణాన్ని కలిగిస్తోంది. ఆ ఆలోచనలతో శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి అజ్ఞాతవ్యక్తి రూపములో అన్నారు. "ఈ సమాజములో సామాన్య మానవుడు మంచి పనిగాని, చెడుపని గాని చేస్తే ఈ సమాజము అంతగా గుర్తు పెట్టుకోదు. అదే ఈ సమాజములో ఉన్నత పదవిలో యున్న వ్యక్తి తప్పు పని చేసినమంచి పని చేసిన ఈ సమాజము దాని గురించి ఆలోచించుతుంది."
(ఇంకా ఉంది)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment